రాష్ట్రంలో బీభత్సమైన వర్షాలు.. నీటమునిగిన వేలాది ఇళ్లు

by Mahesh |
రాష్ట్రంలో బీభత్సమైన వర్షాలు.. నీటమునిగిన వేలాది ఇళ్లు
X

దిశ, వెబ్‌డెస్క్: బంగాళఖాతంలో ఉపరితల ద్రోణి, అల్పపీడనం, వాయుగుండం ప్రభావంతో తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా చెన్నైలోని వేలచేరిలో నిన్న రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షం కారణంగా వేలాది ఇళ్లు వరద నీటిలో మునిగిపోయాయి. ముందస్తు చర్యల్లో భాగంగా అధికారులు తీసుకున్న జాగ్రత్తల వల్ల ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోలేదు. చెన్నై నగరంలో రెండు రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. మహానగరంలో 11 సబ్ వేలు మూసివేశారు. అలాగే సాయంత్రం వరకు మెట్రో రైలు తాత్కాలికంగా రద్దు చేశారు. వరదలు సంభవిస్తున్న క్రమంలో సహాయ చర్యల్లో పాల్గొనడం కోసం 16 వేల మంది వాలంటీర్లను సిద్ధం చేశారు.

ముందస్తు చర్యల్లో భాగంగా చెన్నైలో 980 పునరావస కేంద్రాలు ఏర్పాటు చేశారు. వరద ప్రాంతాల్లో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. 24 గంటలుగా చెన్నైలో నాన్ స్టాప్ గా వర్షం కురుస్తుండడంతో.. ఆరు విమాన సర్వీసులు రద్దు చేశారు. చెన్నై ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు నుంచి వెళ్లే విమానాలు రద్దు చేశారు. ఇందులో చెన్నై- మధురై, చెన్నై- సేలం, మధురై- చెన్నై, షిర్డీ-చెన్నై విమానాలు ఉన్నాయి. సేలం- చెన్నై ఇండిగో ఎయిర్ లైన్స్, మధురై- చెన్నై స్పైస్ జెట్ విమానాలు కూడా రద్దు చేశారు. ప్రస్తుతం వాయుగుండం కారణంగా తమిళనాడు, పుదుచ్చేరి లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. దీంతో అప్రమత్తమైన ప్రభుత్వం అన్ని రకాల ముందస్తు చర్యలు తీసుకొంటున్నారు.

Advertisement

Next Story