గగన్‌యాన్ వ్యోమగాములు వీరే: ప్రకటించిన ప్రధాని మోడీ

by samatah |
గగన్‌యాన్ వ్యోమగాములు వీరే: ప్రకటించిన ప్రధాని మోడీ
X

దిశ, నేషనల్ బ్యూరో: భారతదేశపు తొలి మానవ సహిత అంతరిక్ష యాత్ర గగన్‌యాన్ కోసం శిక్షణ పొందుతున్న నలుగురు వ్యోమగాముల పేర్లను ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం ప్రకటించారు. కేరళ పర్యటనలో ఉన్న ఆయన తిరువనంతపురంలోని విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా గగన్‌యాన్ మిషన్‌లో వెళ్లే వ్యోమగాముల పేర్లను వెల్లడించి వారికి అస్ట్రోనాట్ వింగ్స్ అందజేశారు. వారిలో గ్రూప్ కెప్టెన్ ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్, గ్రూప్ కెప్టెన్ అజిత్ కృష్ణన్, గ్రూప్ కెప్టెన్ అంగద్ ప్రతాప్, వింగ్ కమాండర్ శుభాంశు శుక్లా ఉన్నారు. వీరంతా ఐదేళ్లుగా గగన్ యాన్ ప్రాజెక్టు కోసం శిక్షణ పొందుతున్నారు. అంతేగాక మోడీ ఈ సందర్భంగా సుమారు రూ.1800కోట్ల విలువైన మూడు అంతరిక్ష మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను ప్రారంభించారు. ఇవి భారత అంతరిక్ష రంగానికి ప్రపంచ స్థాయి సాంకేతిక సౌకర్యాలను అందించనున్నాయి.

140కోట్ల భారతీయుల ఆకాంక్ష

ప్రాజెక్టులను ప్రారంభించిన అనంతరం ప్రధాని మోడీ మాట్లాడుతూ..‘గగన్‌యాన్‌లోని నలుగురు ప్రయాణికులు గురించి దేశానికి తెలిసింది. వీరు కేవలం నలుగురు వ్యక్తులు కాదు. 140 కోట్ల మంది భారతీయుల ఆకాంక్షలను అంతరిక్షంలోకి తీసుకెళ్లే శక్తులు’ అని అభివర్ణించారు. 40ఏళ్ల తర్వాత ఒక భారతీయుడు అంతరిక్షంలోకి వెళ్లడం ఎంతో గర్వకారణంగా ఉందన్నారు. ప్రతి దేశ అభివృద్ధిలో ఎన్నోచిరస్మరనీయ గుర్తులు ఉంటాయని తెలిపారు. మానవ సహిత గగన్ యాన్ ప్రయోగం తప్పకుండా విజయవంతం అవుతుందని చెప్పారు. కాగా, మాజీ వింగ్ కమాండర్ రాకేష్ శర్మ 1984లో సోవియట్ మిషన్‌లో భాగంగా అంతరిక్షంలోకి వెళ్లారు.

Advertisement

Next Story

Most Viewed