రాజ్యాంగంలో ఎటువంటి మార్పులూ ఉండవు: బీజేపీ ఎంపీ అశోక్ చవాన్

by samatah |
రాజ్యాంగంలో ఎటువంటి మార్పులూ ఉండవు: బీజేపీ ఎంపీ అశోక్ చవాన్
X

దిశ, నేషనల్ బ్యూరో: భారత రాజ్యాంగంలో ఎటువంటి మార్పులూ ఉండబోవని, ఈ విషయాన్ని ప్రధాని మోడీ స్పష్టంగా తెలియజేశారని బీజేపీ రాజ్యసభ ఎంపీ, మహారాష్ట్ర మాజీ సీఎం అశోక్ చవాన్ తెలిపారు. మహారాష్ట్రలోని నాందేడ్‌లో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాజ్యాంగాన్ని మార్చే అంశంపై వ్యక్తిగత వ్యాఖ్యల కంటే బీజేపీ అధిష్టానం వైఖరే ముఖ్యమైందని చెప్పారు. రాజ్యాంగంపై బీజేపీ ఉత్తర కన్నడ ఎంపీ అనంత్‌కుమార్ హెగ్డే చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను చవాన్ ప్రస్తావిస్తూ.. రాజ్యాంగాన్ని మార్చడానికి సంబంధించిన వ్యాఖ్యలు చేసినందుకు గాను కర్ణాటకలో ఓ నాయకుడికి బీజేపీ టికెట్ నిరాకరించిందని గుర్తు చేశారు. మరాఠా కోటా మద్దతుదారుల నుంచి వ్యతిరేకతను ఎదుర్కోవడం గురించి అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ.. ‘మహాయుతి’ ప్రభుత్వం ఉద్యోగాలు, విద్యలో రిజర్వేషన్లు కల్పించే చట్టాన్ని రూపొందించిందని తెలిపారు. ‘మరాఠా కమ్యూనిటీకి రిజర్వేషన్లు కల్పించే చట్టం అమలులో ఉంది. మరాఠా కోటా మద్దతుదారులకు వివరించడానికి నేను గ్రామాల్లో సమావేశాలు నిర్వహిస్తున్నాను. ఈ చట్టాన్ని కోర్టులో సవాలు చేసినప్పటికీ, దానిపై స్టే ఇవ్వలేదు’ అని వ్యాఖ్యానించారు. కాగా, కాంగ్రెస్ పార్టీకి చెందిన చవాన్ ఇటీవల బీజేపీలో చేరిన విషయం తెలిసిందే.

Advertisement

Next Story

Most Viewed