Jamili elections: జమిలి ఎన్నికలపై విస్తృత స్థాయి చర్చ జరుగాలి : కాంగ్రెస్

by Y. Venkata Narasimha Reddy |   ( Updated:2024-12-12 11:22:20.0  )
Jamili elections: జమిలి ఎన్నికలపై విస్తృత స్థాయి చర్చ జరుగాలి : కాంగ్రెస్
X

దిశ, వెబ్ డెస్క్ : జమిలి(Jamili elections) ఎన్నికల బిల్లును కేంద్ర కేబినెట్(Union Cabinet) ఆమోదం తెలిపిన నేపథ్యంలో ఏ రోజైనా పార్లమెంటు ముందుకు జమిలి ఎన్నికల బిల్లు వచ్చే అవకాశముంది. ఇప్పటికే రామ్ నాథ్ కోవింద్ కమిటీ నివేదికను అమోదించిన కేంద్ర కేబినెట్ ఇప్పుడు బిల్లును కూడా ఆమోదించడం ద్వారా వన్ నేషన్ వన్ ఎలక్షన్(One Nation One Election) నిర్వాహణ దిశగా కీలక ముందడుగు వేసింది. ఈ శీతకాల సమావేశాల్లోనే ఉభయ సభల్లో బిల్లు డ్రాఫ్టును ప్రవేశపెట్టి, అన్ని పార్టీల అభిప్రాయలను తీసుకునేందుకు చర్చ పెట్టనున్నారు. తర్వాత జాయింట్ పార్లమెంటు కమిటీకి బిల్లును పంపించనుంది.

కాంగ్రెస్ పార్టీ సహా పలు ప్రతిపక్ష పార్టీలు జమిలి ఎన్నికలను వ్యతిరేకిస్తున్నాయి. ఒకేసారి దేశమంతటా ఎన్నికలు సాధ్యం కాదంటునే జమిలి ఎన్నికల బిల్లుపై పార్లమెంటులో విస్తృత స్థాయి చర్చ జరుపాలని డిమాండ్ చేస్తోంది. అయితే ఆదానీ అంశాన్ని పక్కదోవ పట్టించేందుకే కేంద్రం జమిలి ఎన్నికల బిల్లును తెరపైకి తెచ్చిందని కూడా కాంగ్రెస్ అనుమానిస్తుంది. ఆమ్ ఆద్మీ పార్టీ జమిలి ఎన్నికలను పొలిటికల్ జిమ్మిక్కుగా కొట్టిపడేసింది. అటు ప్రధాని మోడీ జమిలి ఎన్నికల నిర్వాహణకు పట్టుదలతో వ్యవహరిస్తున్నారు. జమిలి ఎన్నికలు దేశాభివృద్ధికి దోహదం చేస్తాయని మోడీ గట్టిగా విశ్వసిస్తున్నారు. 2029ఎన్నికలకు ముందే 2027నాటికే వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లు అమోద ప్రక్రియను పూర్తి చేయాలని భావిస్తున్నారు. కనీసం 18రాజ్యాంగ సవరణలు జమిలి ఎన్నికల నిర్వాహణ కోసం చేయాల్సి ఉండటంతో దీనిపై కేంద్రం ఫోకస్ పెట్టింది.

సవరణలకు ఉభయ సభలు, రాష్ట్రాల ఆమోదం సాధించడం..జమిలి ఎన్నికల దాకా కొన్ని రాష్ట్ర ప్రభుత్వాల గడువు పొడగించడం..స్థానిక సంస్థల అంశంపై కూడా కీలక నిర్ణయాలు తీసుకోవాల్సిఉంది. దీంతో జమిలి ఎన్నికల నిర్వాహణ దిశగా ఉన్న అడ్డంకులన్నింటిని అధిగమించడంతో పాటు జాయింట్ పార్లమెంటరీ కమిటీ చేసే సిఫారసులను కూడా పరిష్కరించుకుని వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి జమిలి ఎన్నికలు నిర్వహించాలన్న లక్ష్యంతో ప్రధాని మోడీ 3.0 ప్రభుత్వం ముందుకెలుతోంది.

Advertisement

Next Story

Most Viewed