Retail Inflation: దిగొచ్చిన ధరలు.. నవంబర్‌లో 5.4 శాతానికి రిటైల్ ద్రవ్యోల్బణం

by S Gopi |   ( Updated:2024-12-12 13:33:48.0  )
Retail Inflation: దిగొచ్చిన ధరలు.. నవంబర్‌లో 5.4 శాతానికి రిటైల్ ద్రవ్యోల్బణం
X

దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయంగా నవంబర్ నెల రిటైల్ ద్రవ్యోల్బణం దిగొచ్చింది. ఆహార పదార్థాలు దిగిరావడంతో గత నెలలో వినియోగదారుల ధరల సూచీ(సీపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం 5.48 శాతానికి చేరింది. అంతకుముందు నెలలో ఆర్‌బీఐ లక్ష్యం(6 శాతం) కంటే ఎక్కువ 6.21 శాతంగా నమోదైన సంగతి తెలిసిందే. కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ(ఎన్ఎస్ఓ) గురువారం విడుదల చేసిన డేటా ప్రకారం, ముఖ్యంగా కూరగాయల ధరలు తగ్గడమే సీపీఐ ద్రవ్యోల్బణం దిగిరావడానికి కారణం. నవంబర్‌లో ఆహార ప్రదార్థాల ద్రవ్యోల్బణం 10.87 శాతం నుంచి 9.04 శాతానికి తగ్గింది. గతేడాది ఇదే నెలలో 8.70 శాతంగా ఉంది. ఆహార పదార్థాల్లో కూరగాయలతో పాటు పప్పులు, పండ్లు, పాలు, పాల ఉత్పత్తులు, కోడిగుడ్ల ధరలు ఎక్కువగా తగ్గాయి. పట్టణ ప్రాంతాల్లో 4.83 శాతంతో పోలిస్తే గ్రామీణ ప్రాంతాల్లో 5.95 శాతం అధిక ద్రవ్యోల్బణం నమోదైంది. మరోవైపు, అక్టోబర్ నెలలో దేశీయ పారిశ్రామికోత్పత్తి నెమ్మదించిందని ఎన్ఎ్ఓ గణాంకాలు వెల్లడించాయి. ప్రధాన తయారీ, విద్యుత్ రంగాల్లో కార్యకలాపాలు రాణించడంతో సమీక్షించిన నెలలో పారిశ్రామికోత్పత్తి సూచీ (ఐఐపీ) 3.5 శాతం వృద్ధి చెందింది. అదే నెలలో తయారీ రంగం 4.1 శాతం, విద్యుదుత్పత్తి 2 శాతం, మైనింగ్ 0.9 శాతం పెరిగాయి.

Advertisement

Next Story

Most Viewed