ఏడో దశ పోలింగ్ పై సర్వత్రా ఆసక్తి..ఎందుకంటే?

by samatah |
ఏడో దశ పోలింగ్ పై సర్వత్రా ఆసక్తి..ఎందుకంటే?
X

దిశ, నేషనల్ బ్యూరో: దేశ వ్యాప్తంగా ఏడు దశల్లో జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు గాను ఆరు దశల ఎన్నికలు ఇప్పటికే పూర్తయ్యాయి. మరో దశ పోలింగ్ జరిగితే ఎన్నికలకు సంబంధించి కీలక ఘట్టానికి తెరపడినట్టే. జూన్ 1వ తేదీన ఏడో దశ పోలింగ్ జరగనుంది. అయితే మిగతా ఫేస్‌లో జరిగిన ఓటింగ్ కంటే చివరి దశ పోలింగ్ పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఎందుకంటే ప్రధాని మోడీ బరిలో నిలిచిన వారణాసి నియోజకవర్గానికి కూడా ఈ ఫేస్‌లో ఓటింగ్ జరగనుంది. అంతేగాక సినీ నటి కంగనా రనౌత్, ఖలిస్థాన్ వేర్పాటువాది అమృత్ పాల్ సింగ్ కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఈ నేపథ్యంలో ఏడో దశ పోలింగ్‌ వివరాలను ఓ సారి తెలుసుకుందాం.

చివరి దశలో భాగంగా ఎనిమిది రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని మొత్తం 57 లోక్ సభ నియోజకవర్గాలకు పోలింగ్ జరగనుంది. ఉత్తరప్రదేశ్‌ 13, పంజాబ్‌లో 13, పశ్చిమ బెంగాల్‌లో 9 , బిహార్‌లో 8, ఒడిశాలో 6 సీట్లు, హిమాచల్‌ప్రదేశ్‌లో 4, జార్ఖండ్‌లో 3, కేంద్ర పాలిత ప్రాంతమైన చండీగఢ్‌లో ఒక స్థానానికి ఎన్నికలు నిర్వహించనున్నారు. మొత్తంగా 904 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. పంజాబ్ నుంచి అత్యధికంగా 328 అభ్యర్థులు పోటీలో ఉండగా..ఆ తర్వాత యూపీలో 144, బిహార్‌లో 134 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. దీనికి సంబంధించి ఎలక్షన్ కమిషన్ ఇప్పటికే ఏర్పాట్లు చేసింది.

కీలక అభ్యర్థులు వీరే

ఏడో దశలో భాగంగా ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి నుంచి ప్రధాని మోడీతో పాటు అదే స్థానం నుంచి కాంగ్రెస్ కీలక నేత అజయ్ రాయ్ బరిలో ఉన్నారు. దీంతో ఇక్కడ పోలింగ్ పై ఆసక్తి నెలకొంది. అలాగే పంజాబ్ లోని ఖదూర్ సాహిబ్ సెగ్మెంట్ నుంచి ఖలిస్థాన్ వేర్పాటు వాది అమృతపాల్ సింగ్, హిమాచల్ ప్రదేశ్‌లోని మండి నుంచి సినీ నటి కంగనా రనౌత్‌, కాంగ్రెస్ సీనియర్ నాయకులు విక్రమాదిత్య సింగ్ పోటీలో ఉన్నారు. జమ్మూ కశ్మీర్ లోని బారాముల్లా నుంచి నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా, బిహార్‌లోని పాట్నా సాహిబ్ లో కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్, పశ్చిమ బెంగాల్‌లోని జాదవ్‌పూర్ నుంచి టీఎంసీ నేత సయోని ఘోష్, డైమండ్ హార్బర్ నుంచి అభిషేక్ బెనర్జీ, యూనీలోని గోరఖ్‌పూర్ నుంచి బీజేపీ నేత రవి కిషన్‌లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.

కాగా, ప్రస్తుతం జరుగుతున్న లోక్‌సభ ఎన్నికల్లో తొలి దశలో 66.14 శాతం ఓటింగ్ నమోదైంది. ఆ తర్వాత రెండో విడతలో 66.71 శాతం, మూడో దశలో 65.68 శాతం, నాలుగో దశలో 69.16 శాతం, ఐదో దశలో 62.2 శాతం ఓటింగ్ నమోదుకాగా.. శనివారం జరిగిన ఆరో విడత పోలింగ్‌లో 61.98 శాతం పోలింగ్‌ నమోదైంది. మొత్తంగా 545 స్థానాలకు గాను ఇప్పటి వరకు 488 స్థానాల్లో పోలింగ్ పూర్తైంది. మరో 57 స్థానాలకు జూన్ 1న పోలింగ్ జరగనుండగా, అదే నెల 4న ఫలితాలు వెలువడనున్నాయి.

Advertisement

Next Story