ఢిల్లీలో నీటి సంక్షోభం.. హిమాచల్ ప్రదేశ్‌కు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

by Harish |
ఢిల్లీలో నీటి సంక్షోభం.. హిమాచల్ ప్రదేశ్‌కు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
X

దిశ, నేషనల్ బ్యూరో: ఢిల్లీలో నీటి సంక్షోభం దృష్ట్యా సుప్రీంకోర్టు హిమాచల్ ప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వానికి జూన్ 6న కీలక ఆదేశాలు జారీ చేసింది. దేశ రాజధానిలో ప్రజల నీటి సమస్యను తీర్చడానికి 137 క్యూసెక్కుల మిగులు జలాలను ఢిల్లీకి విడుదల చేయాలని రాష్ట్రాన్ని ఆదేశించింది. అదే సమయంలో ఈ సమాచారాన్ని ముందుగా హర్యానా రాష్ట్రానికి తెలియజేయాలని పేర్కొంది. ఇంతకుముందు ఢిల్లీకి నీటిని విడుదల చేసేలా చూడాలని హిమాచల్ ప్రదేశ్, హర్యానా రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించాలని ఢిల్లీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిని విచారణ చేపట్టగా, హిమాచల్ ప్రభుత్వం తమ వద్ద మిగులు జలాలు ఉన్నాయని, వాటిని ఢిల్లీకి విడుదల చేయడానికి ఎలాంటి అభ్యంతరం లేదని తెలిపింది. నీటిని దేశ రాజధాని అవసరాల కోసం విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు పేర్కొంది.

హిమాచల్ నుంచి విడుదల అయిన నీరు హర్యానా రాష్ట్రం ద్వారా ప్రయాణించి ఢిల్లీకి చేరుకోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఎలాంటి అడ్డంకులు లేకుండా నీటి సరఫరా జరగడానికి చర్యలు తీసుకోవాలని సూచించింది. విడుదలైన నీరు మొదటగా హర్యానా రాష్ట్రం హత్నికుండ్ బ్యారేజీకి చేరుకుంటాయి. అక్కడి నుంచి ఢిల్లీలోని వజీరాబాద్‌కు చేరుకుంటాయి. ఇదిలా ఉంటే విడుదలైన నీరు తమ రాష్ట్రం గుండా వెళ్లాల్సి ఉంటుంది. అయితే ఆ నీటిని కొలవాల్సిన అవసరం ఉందని హర్యానా వాదించింది. దీంతో హిమాచల్ విడుదల చేసిన నీటిని కొలవాలని ఎగువ యమునా రివర్ బోర్డును కోర్టు ఆదేశించింది. అలాగే, నీరు వృధా కాకుండా చూసుకోవాలని ఢిల్లీ ప్రభుత్వాన్ని కోరింది.

Advertisement

Next Story