రెండో రోజూ కొనసాగిన సమావేశాలు..ప్రమాణం చేసిన ప్రముఖులు వీరే?

by vinod kumar |
రెండో రోజూ కొనసాగిన సమావేశాలు..ప్రమాణం చేసిన ప్రముఖులు వీరే?
X

దిశ, నేషనల్ బ్యూరో: 18వ లోక్‌సభ తొలి సమావేశాలు రెండో రోజు కూడా కొనసాగాయి. సెషన్ ప్రారంభం కాగానే ప్రొటెం స్పీకర్ మహతాబ్ సభ్యులతో ప్రమాణం చేయించడం మొదలు పెట్టారు. మంగళవారం 281 మంది ఎంపీలు ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉండగా అందులో కొంత మంది గైర్హాజరయ్యారు. రాహుల్ గాంధీ, అఖిలేష్ యాదవ్, మహువా మొయిత్రా, సుప్రియా సూలే, కనిమొళి కరుణానిధి, ఓం బిర్లా, ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ, కేంద్ర మంత్రి నారాయన్ రాణే, శివసేన (యూబీటీ) ఎంపీ అరవింద్ సామంత్‌, త్రిపుర మాజీ సీఎం బిప్లబ్ కుమార్ దేబ్‌, మాజీ క్రికెటర్ యూసఫ్ పఠాన్‌లు ప్రమాణ స్వీకారం చేసిన ప్రముఖుల్లో ఉన్నారు. ఖలిస్థానీ నేత అమృతపాల్ సింగ్ సహా మరికొంత మంది గైర్హాజరయ్యారు. సభ్యుల ప్రమాణం అనంతరం ప్రొటెం స్పీకర్ భర్తృహరి మహతాబ్ సభను బుధవారం ఉదయం 11గంటలకు వాయిదా వేశారు. ప్రమాణ స్వీకారం సందర్భంగా పలువురు సభ్యులు జై హింద్, జై మహారాష్ట్ర, జై భీమ్, జై శివాజీ నినాదాలు చేయడం గమనార్హం. వివిధ రాష్ట్రాల ఎంపీలు త‌మ మాతృ భాష‌లో ప్రమాణం చేయగా.. బీజేపీ ఎంపీల్లో ఎక్కువ మంది హిందీ, ఇంగ్లీష్ భాష‌ల్లో ప్రమాణ స్వీకారం చేశారు.

రాజ్యాంగ ప్రతితో రాహుల్ ప్రమాణం

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ యూపీలోని రాయ్‌బరేలీ ఎంపీగా ప్రమాణం చేశారు. రాహుల్ ప్రమాణం చేయడానికి వచ్చే టైంలో ఇండియా కూటమి సభ్యులంతా భారత్ జోడో నినాదాలు చేశారు. ప్రమాణం చేస్తున్నపుడు రాహుల్ భారత రాజ్యాంగం ప్రతిని పట్టుకున్నారు. ప్రమాణం పూర్తైన తర్వాత రాహుల్ జై హింద్ జై సంవిధాన్ నినాదాలు చేశారు.ఇండియా కూటమి ఎంపీలందరూ ఇదే తరహాలో రాజ్యాంగ ప్రతిని చేత పట్టుకుని ప్రమాణం చేయడం విశేషం.

‘రీ- నీట్’ టీ షర్ట్ ధరించిన పప్పు యాదవ్

బిహార్‌లోని పూర్నియాకు చెందిన స్వతంత్ర ఎంపీ పప్పు యాదవ్ లోక్‌సభ సభ్యునిగా ప్రమాణం చేశారు. ఈ సమయంలో ఆయన ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ‘రీ-నీట్’ అని రాసి ఉన్న టీ-షర్ట్ ధరించి కనిపించారు. ప్రమాణం అనంతరం రీ-నీట్‌, బిహార్‌కు ప్రత్యేక హోదా, రాజ్యాంగాన్ని బతికించండి అంటూ నినాదాలు చేశారు. పలువురు సభ్యులు ఆయన నినాదాలపై అభ్యంతరం తెలిపారు.

Advertisement

Next Story