వాహనదారులకు సర్కార్ BIG షాక్.. ఆ బండ్లకు పెట్రోల్ పోయొద్దని ఆదేశాలు

by Gantepaka Srikanth |
వాహనదారులకు సర్కార్ BIG షాక్.. ఆ బండ్లకు పెట్రోల్ పోయొద్దని ఆదేశాలు
X

దిశ, వెబ్‌డెస్క్: ఢిల్లీలోని కూటమి ప్రభుత్వం(NDA Govt) కీలక నిర్ణయం తీసుకున్నది. 15 ఏళ్లు పైబడిన వాహనాలకు పెట్రోల్(Petrol) పోయొద్దని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని బంకులకు పర్యావరణశాఖ మంత్రి మంజీందర్ సింగ్ సిర్సా(Minister Manjinder Singh Sirsa) ఆదేశాలు జారీ చేశారు. ఏప్రిల్ ఒకటి నుంచి నిబంధనలు పక్కాగా అమలు చేయాలని శనివారం మధ్యాహ్నం జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఢిల్లీలో పర్యావరణాన్ని కాపాడటానికే నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి సిర్సా స్పష్టం చేశారు. మార్చి 31 తర్వాత ఢిల్లీలోని పెట్రోల్ పంపుల వద్ద 15 ఏళ్ల కంటే పాత వాహనాలకు ఎట్టి పరిస్థితుల్లో ఇంధనం ఇవ్వబోమని స్పష్టం చేశారు. వాయు కాలుష్యం(Air pollution)తో దేశ రాజధాని అయిన ఢిల్లీ(Delhi)లో ప్రజలు అతలాకుతలం అవుతున్నారని తెలిపారు. ఈ వాయు కాలుష్యాన్ని ఎదుర్కోవడానికి ఒక్కొక్కటిగా అన్నీ చక్కబెడుతూ వస్తున్నామని.. ఈ క్రమంలోనే ముందుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

మరోవైపు.. ఏప్రిల్‌ 1 నుంచి పదిహేనేండ్లు పైబడిన అన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వాహనాలను తుక్కుగా మార్చాలని కేంద్ర రోడ్డు రవాణా శాఖ(Central Road Transport Department) నిర్ణయించింది. రవాణా కార్పొరేషన్లకు చెందిన బస్సులకు కూడా ఇదే నిబంధనలు వర్తిస్తాయని తెలిపింది. అయితే, భద్రతా బలగాలు, శాంతిభద్రతల కోసం వాడే వాహనాలకు మాత్రం మినహాయింపును ఇచ్చింది. వాటిని స్క్రాప్‌గా మార్చితే కొత్త వాహనాల కొనుగోలులో రాయితీలు ఇస్తామని కేంద్రం ప్రకటన చేసిన విషయం తెలిసిందే.

దీనిపై గతంలో కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ(Union Minister Nitin Gadkari) మాట్లాడుతూ.. ప్రతి సిటీ సెంటర్ నుంచి 150 కిలోమీటర్లలోపు ఓ వాహన తుక్కు కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని అన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ(PM Modi) 2021లో నేషనల్ వెహికల్ స్క్రాపేజ్ పాలసీ(National Vehicle Scrappage Policy)ని ప్రారంభించారు. ఇది పనికిరాని, కాలుష్యం కలిగించే వాహనాలను దశలవారీగా నిర్మూలించడానికి ఉపయోగపడుతుందని అన్నారు.

Next Story