జమ్మూకశ్మీర్‌ పాఠశాలల్లో జాతీయ గీతం పాడటం తప్పనిసరి

by Harish |
జమ్మూకశ్మీర్‌ పాఠశాలల్లో జాతీయ గీతం పాడటం తప్పనిసరి
X

దిశ, నేషనల్ బ్యూరో: జమ్మూకశ్మీర్‌ కేంద్రపాలిత ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని పాఠశాలల్లో రోజూ ఉదయం జాతీయ గీతం పాడటాన్ని తప్పనిసరి చేశారు. విద్యార్థుల చేత జాతీయ గీతం తప్పనిసరిగా పాడించేలా చూడాలని పాఠశాల విద్యా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ నుండి ఒక సర్క్యులర్ జారీ అయింది. కొత్త నిబంధనల ప్రకారం, కేంద్రపాలిత ప్రాంతంలోని అన్ని పాఠశాలల్లో ఉదయం పాఠాలు ప్రారంభించే ముందు విద్యార్థులు, ఉపాధ్యాయులు ఒకచోట గుమిగూడి జాతీయ గీతాన్ని పాడటంతో పాటు పలు అంశాలపై చర్చించాల్సి ఉంటుంది. ఈ సమావేశం 20 నిమిషాల పాటు కొనసాగాలని సర్క్యులర్‌లో పేర్కొన్నారు.

ఈ సమావేశంలో గొప్ప వ్యక్తులు, స్వాతంత్య్ర సమరయోధుల ఆత్మకథలను చర్చించాలని, విద్యార్థులను ప్రోత్సహించడానికి, వారిలో దేశభక్తిని పెంపొందించడానికి, స్ఫూర్తిదాయకమైన ప్రసంగాలను అందించాలని ఉపాధ్యాయులకు సూచించారు. ఇంకా విద్యార్థులకు మానసిక బలం కలిగించేలా సాంస్కృతిక వేడుకలు, ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహించడానికి ఉద్దేశించిన ఒత్తిడి నిర్వహణ, ఆరోగ్యానికి సంబంధించిన చిట్కాలు, విభిన్న సంస్కృతులు, చారిత్రక సంఘటనలు, మొదలగు అంశాల గురించి రోజూ ఉదయం విద్యార్థులకు అవగాహన కల్పించాలని, అలాగే, అతిధులను ఆహ్వానించడం, పర్యావరణం, మాదకద్రవ్యాల మహమ్మారి గురించి అవగాహన కల్పించడం వంటి మొత్తం16 అంశాలను పాఠశాలలు తప్పనిసరిగా పాటించాలని సర్క్యూలర్‌లో పేర్కొన్నారు. గతంలో ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఉదయం పాఠశాలలు ప్రారంభించే ముందు జాతీయ గీతాన్ని ఆలపించడం తప్పనిసరిగా ఉండగా ఈ పద్ధతి ఏకరీతిగా పాటించడం లేదని గుర్తించిన అధికారులు తాజాగా కొత్త సర్క్యులర్‌ను జారీచేశారు. దీని ద్వారా విద్యార్థుల మధ్య ఐక్యత, క్రమశిక్షణను పెంపొందించడానికి వీలవుతుందని అధికారులు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed