రాబోయే రోజుల్లో నాకంతా కష్టకాలమే.. కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌదరి

by vinod kumar |
రాబోయే రోజుల్లో నాకంతా కష్టకాలమే.. కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌదరి
X

దిశ, నేషనల్ బ్యూరో: పశ్చిమ బెంగాల్ కాంగ్రెస్ చీఫ్ అధిర్ రంజన్ చౌదరి తన భవిష్యత్‌పై ఆందోళన వ్యక్తం చేశారు. బహరంపూర్ నియోజకవర్గంలో ఓటమి పాలైన అనంతరం ఆయన తొలిసారిగా స్పందించారు. రాబోయే రోజులన్నీ తనకు కష్టకాలమేనని తెలిపారు. ‘నన్ను బీపీఎల్ (దారిద్య్రరేఖకు దిగువన) ఎంపీగా పిలుస్తాను. నాకు రాజకీయాలు తప్ప మరే ఇతర పనుల్లో నైపుణ్యాలు లేవు. కాబట్టి ఇక నుంచి నాకు అన్నీ కష్టాలే ఉంటాయి. వాటిని ఎలా అధిగమించాలో కూడా తెలియదు’ అని అన్నారు. తాజాగా ఓ మీడియా చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రజల కోసం తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) ప్రభుత్వంతో ఎంతో పోరాటం చేశానని, కానీ నా భవిష్యత్ కోసం ఆదాయ వనరులేవీ సమకూర్చుకోలేదని తెలిపారు.

ఎంపీగా ఉన్నప్పుడు కేటాయించిన అధికారిక నివాసాన్ని ఖాళీ చేయడానికి త్వరలో ఢిల్లీకి వెళ్లాలని యోచిస్తున్నట్టు తెలిపారు. తన కుమార్తె విద్యార్థిగా ఉన్నందున, తన చదువు కోసం ఈ స్థలాన్ని తరచుగా ఉపయోగిస్తుందని చెప్పారు. ఓడిపోయిన నేపథ్యంలో పీసీసీ చీఫ్‌గా కొనసాగుతారా అన్న ప్రశ్నకు ఆయన స్పందిస్తూ.. గతంలోనే పదవికి రాజీనామా చేయాలనుకున్నానని స్పష్టం చేశారు. కానీ సోనియా అభ్యర్థన మేరకు నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నానని చెప్పారు. ఓటమి తర్వాత కాంగ్రెస్ నాయకులెవరూ తనకు కాల్ చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పీసీసీ చీఫ్ గా కొనసాగాలా వద్దా అనే విషయమై త్వరలో ఆలోచించి నిర్ణయం తీసుకుంటానన్నారు.

Advertisement

Next Story