మరింత ముదిరిన మహా, కర్ణాటక బార్డర్ ఇష్యూ!

by GSrikanth |
మరింత ముదిరిన మహా, కర్ణాటక బార్డర్ ఇష్యూ!
X

దిశ, డైనమిక్ బ్యూరో: మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల మధ్య బార్డర్ వివాదం మరింత ముదురుతోంది. సరిహద్దులో ఉన్న గ్రామాలు తమవంటే తమవే అని ఇరు రాష్ట్రాలు వాదించుకుంటున్న నేపథ్యంలో మంగళవారం మహారాష్ట్ర అసెంబ్లీ కీలక తీర్మానానికి ఆమోద ముద్ర వేసింది. కర్ణాటక సరిహద్దుపై ఇవాళ మహారాష్ట్ర అసెంబ్లీలో ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే తీర్మానం ప్రవేశపెట్టారు. బెల్గాం, బీదర్ సహా మరాఠీ మాట్లాడే 865 గ్రామాల్లోని ప్రతి అంగుళం మహారాష్ట్రకే చెందుతుందని తీర్మాణం చేశారు. సీఎం ప్రవేశపెట్టిన ఈ తీర్మానం అసెంబ్లీలో ఏకగ్రీవంగా ఆమోదం పొందింది. బెల్గాం, కార్వార్, బీదర్, నిపానీ, భాల్కీలోని ప్రతి అంగుళం మహారాష్ట్రలో భాగమని ఇందుకోసం అవసరం అయితే సుప్రీంకోర్టులోనూ పోరాటం చేస్తామని మహారాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే వచ్చే ఏడాది కర్ణాటక అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి.

ఈ ఇష్యూపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా జోక్యం చేసుకున్నప్పటికీ, బీజేపీ ప్రభుత్వాలు అధికారంలో ఉన్న ఈ రెండు రాష్ట్రాల మధ్య వివాదం మరింత తీవ్రం కావడం రాజకీయంగా దుమారం రేపుతోంది. కాగా సరిహద్దు విషయంలో మహారాష్ట్ర అనవసరంగా వివాదాలు సృష్టిస్తోందని కర్ణాటక సీఎం ఇప్పటికే ఎటాక్ ప్రారంభించారు. రాష్ట్ర ప్రయోజనాలను పరిరక్షించేందుకు కట్టుబడి ఉన్నామని గత వారం కర్ణాటక ప్రభుత్వం సైతం తీర్మానం చేసింది. ఈ నేపథ్యంలో రెండు రాష్ట్రాల మధ్య ఏర్పడిన సరిహద్దు వివాదం చలికాలంలోనూ రాజకీయ వేడి రాజేస్తోంది. ఈ ఇష్యూ చివరకు ఎటువైపు దారితీస్తుందో అనేది రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా మారింది. మరో వైపు ఈ వివాదంపై బీజేపీ ప్రభుత్వాలను ఇరు రాష్ట్రాల్లోని ప్రతిపక్షాలు కార్నర్ చేస్తున్నాయి.

Advertisement

Next Story