ఆ నిర్ణయం హై కమాండ్ దే: సీఎం పదవిపై డీకే శివకుమార్

by vinod kumar |
ఆ నిర్ణయం హై కమాండ్ దే: సీఎం పదవిపై డీకే శివకుమార్
X

దిశ, నేషనల్ బ్యూరో: కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ను సీఎంగా నియమించాలంటూ పార్టీలోని పలువురు వ్యక్తులు, ఇతర నేతలు డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శివకుమార్ స్పందించారు. తనకు ఎవరి సిఫార్సులు అవసరం లేదని, తన పనిని బట్టి హైకమాండ్ నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. శనివారం ఆయన బెంగళూరులో మీడియాతో మాట్లాడారు. ‘ఉప ముఖ్యమంత్రులపై చర్చ లేదు, సీఎం పదవిపై కూడా చర్చించే ప్రశ్నే లేదు. కుమార చంద్రశేఖరనాథ స్వామి నాపై ప్రేమతో మాట్లాడారు. ఎవరూ ఎటువంటి ప్రతిపాదనలు చేయొద్దని అభ్యర్థిస్తున్నా. నా పనిని బట్టి అధిష్టానం నిర్ణయం తీసుకుంటుంది’ అని వ్యాఖ్యానించారు.

కర్ణాటక ప్రయోజనాల కోసం ఎలా ముందుకెళ్లాలనే దానిపై ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, సీఎం, హైకమాండ్‌తో ఏకాభిప్రాయానికి వచ్చామని తెలిపారు. ఎమ్మెల్యేలు, మంత్రులు, ఏ మత పెద్దలు ఈ విషయం గురించి మాట్లాడాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. తనకు మద్దతివ్వాలనుకుంటే మనసులో ప్రార్థించుకోవాలని కానీ..మీడియాతో మాత్రం మాట్లాడొద్దని సూచించారు. బహిరంగ ప్రకటనలు చేసిన వారికి ఏఐసీసీ నుంచి నోటీసులు వస్తే మాత్రం నేనేం చేయలేనని హెచ్చరించారు. రాజకీయాల్లో జోక్యం చేసుకోవద్దని మత పెద్దలకు విజ్ఞప్తి చేశారు.

Next Story