ఆ నిర్ణయం సహకార సమాఖ్యకు విరుద్ధం..ప్రధాని మోడీకి కేరళ సీఎం లేఖ

by vinod kumar |
ఆ నిర్ణయం సహకార సమాఖ్యకు విరుద్ధం..ప్రధాని మోడీకి కేరళ సీఎం లేఖ
X

దిశ, నేషనల్ బ్యూరో: కువైట్‌లో ఇటీవల జరిగిన అగ్నిప్రమాదం తర్వాత బాధితులను పరామర్శించేందుకు అక్కడకు వెళ్లడానికి కేరళ ఆరోగ్య మంత్రి వీణా జార్జ్‌కు కేంద్రం క్లియరెన్స్ ఇవ్వకపోవడంపై సీఎం పినరయి విజయన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ మేరకు ప్రధాని మోడీకి బుధవారం ఓ లేఖ రాశారు. విషాద సమయంలో రాజకీయ వైరుద్యాలు పక్కన బెట్టాలని సూచించారు. ఎలాంటి రాజకీయ పక్షపాతం లేకుండా కేంద్రం క్లియరెన్స్ ఇచ్చి ఉంటే, రాష్ట్ర మంత్రి అధికారులతో అవసరమైన అనుసంధానాన్ని అందించి బాధిత కుటుంబాలకు భరోసా ఇచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. కేరళ ప్రభుత్వ అభ్యర్థనకు విదేశాంగ మంత్రి జైశంకర్ నుంచి ఎటువంటి స్పందన లేదని, ఇది అత్యంత దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయం సహకార సమాఖ్య స్పూర్తికి పూర్తి విరుద్ధమని తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి అభ్యర్థనలపై మరింత వేగంగా స్పందించేలా విదేశాంగ మంత్రిత్వ శాఖకు సలహా ఇవ్వాలని ప్రధాని మోడీకి లేఖలో విజ్ఞప్తి చేశారు.

కాగా, కువైట్‌లోని అల్-మంగాఫ్ లేబర్ క్యాంప్ భవనంలో జరిగిన అగ్ని ప్రమాదంలో కేరళకు చెందిన 24 మందితో సహా 49 మంది భారతీయులు ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో సహాయ చర్యలను సులభతరం చేయడానికి మంత్రి వీణా జార్జ్‌ను కువైట్ పంపించేందుకు కేరళ ప్రభుత్వం ప్రత్యేక కేబినెట్ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. అయితే కేరళ అభ్యర్థనపై కేంద్ర ప్రభుత్వం స్పందించకపోవడంతో వీణా జార్జ్ తన ప్రయాణాన్ని నిలిపివేయాల్సి వచ్చింది.

Advertisement

Next Story

Most Viewed