Thai PM: థాయ్ లాండ్ ప్రధాని స్రెట్టా థావిసిస్ పై వేటు

by Shamantha N |
Thai PM: థాయ్ లాండ్ ప్రధాని స్రెట్టా థావిసిస్ పై వేటు
X

దిశ, నేషనల్ బ్యూరో: థాయ్‌లాండ్‌ లో రాజకీయ అనిశ్చితి నెలకొంది. నైతిక ఉల్లంఘనలకు పాల్పడ్డారనే అభియోగాలపై థాయ్ ప్రధాని స్రెట్టా థావిసిస్ పై అక్కడి కోర్టు వేటు వేసింది. థావిసిస్ ను పదవి నుంచి తొలగిస్తూ ఆదేశ ఉన్నత న్యాయస్థానం తీర్పు వెలువరించింది. నేర చరిత్ర కలిగి మాజీ న్యాయవాదిని పిచిత్ చుయెన్ బాన్ ను థావిసిస్ తన మంత్రివర్గంలో నియమించారు. దీంతో, 40 మంది సెనేటర్లు తిరుగుబాటు చేశారు. ప్రధాని థావిసిస్ ని పదవి నుంచి తప్పించాలని కోర్టుని ఆశ్రయించారు. పిచిత్ నియామకం రాజ్యాంగ, నైతిక ఉల్లంఘనలకు పాల్పడమే అని కోర్టు పేర్కొంది. ఆయన్ని పదవి నుంచి సస్పెండ్ చేసింది. ఈ ఆదేశాలు తక్షణమే అమల్లోకి వస్తాయని వెల్లడించింది. కొత్త ప్రధాని నియామకానికి అక్కడి పార్లమెంటు ఆమోదం పొందేంత వరకు ప్రస్తుత కేబినెట్‌ తాత్కాలికంగా కొనసాగుతుందని స్పష్టం చేసింది. అయితే, ఎప్పటిలోగా ప్రధాని పదవిని భర్తీ చేస్తారనే విషయంపై ఎలాంటి ప్రకటన చేయలేదు.

కేబినేట్ సభ్యుడిగా నేరచరిత్ర ఉన్న వ్యక్తి

2008లో ఓ జడ్జికి దాదాపు 55 వేల డాలర్లు లంచం ఇచ్చేందుకు పిచిత్ ప్రయత్నించాడు. లంచం ఇవ్వడానికి యత్నించిన కోర్టు ధిక్కార కేసులో ఆయన ఆరునెలల పాటు శిక్ష కూడా అనుభవించాడు. ఐదేళ్లపాటు పిచిత్ లా లైసెన్స్ పై నిషేధం పడింది. అయితే, కేబినేట్ పునర్‌వ్యవస్థీకరణలో భాగంగా పిచిత్‌ చుయెన్‌బాన్‌ను మంత్రి వర్గంలోకి ప్రధాని థావిసిస్ తీసుకున్నారు. జైలు శిక్ష పడిన వ్యక్తిని మంత్రిగా తీసుకున్నారని విమర్శలు రావడంతో పిచిత్ పదవికి రాజీనామా చేశారు. కేబినేట్ సభ్యుడి అర్హతలు పరిశీలించాల్సిన బాధ్యత ప్రధానిదే నని కోర్టు పేర్కొంది. పిచిత్ ని కేబినేట్ లోకి తీసుకోవడం నైతిక ఉల్లంఘనే అని పేర్కొంది. ప్రతిపక్ష పార్టీని రద్దు చేయాలని థాయ్ కోర్టు ఆదేశించిన కొన్ని రోజులకే ప్రధానిపై వేటు పడటం గమనార్హం.

Advertisement

Next Story

Most Viewed