Delhi Police: ఐసిస్ మాడ్యూల్ టెర్రరిస్టు రిజ్వాన్ అలీ అరెస్టు

by Shamantha N |
Delhi Police: ఐసిస్ మాడ్యూల్ టెర్రరిస్టు రిజ్వాన్ అలీ అరెస్టు
X

దిశ, నేషనల్ బ్యూరో: ఐసిస్ మాడ్యూల్ టెర్రరిస్టు రిజ్వాన్ అబ్దుల్ హాజీ అలీని ఢిల్లీ పోలీసులు ప్రత్యేక విభాగం శుక్రవారం తెల్లవారుజామున అరెస్టు చేసింది. రిజ్వాన్ అలీపై జాతీయ దర్యాప్తు సంస్థ(NIA) అరెస్టు వారెంట్ జారీ చేసింది. అతడిపై రూ.3 లక్షల రివార్డు గతంలోనే ఎన్ఐఏ ప్రకటించింది. పూణే పోలీసుల కస్టడీ నుంచి తప్పించుకున్నాడు. అప్పట్నుంచి రిజ్వాన్ అలీ పరారీలో ఉన్నాడు. అయితే, ఢిల్లీలోని దర్యాగంజ్ లోని నివాసం నుంచి నిందితుడ్ని పోలీసులు అరెస్టు చేశారు. అతడి నుంచి పోలీసులు ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. పూణే ఐసిస్ మాడ్యూల్‌కు చెందిన పలువురు సభ్యులను గతంలో పూణే పోలీసులు, ఎన్‌ఐఏ అరెస్టు చేసింది.

పూణే ఐసిస్ మాడ్యూల్ కేసు ఏంటంటే?

జులై 2023లో మహారాష్ట్రలోని పూణేలో ఆయుధాలు, పేలుడు పదార్థాలు, రసాయనాలు, ఐసిస్ తో సంబంధాలున్న 11 మందినిపై ఎన్ఐఏ అభియోగాలు మోపింది. పూణే పరిసరప్రాంతాల్లో ఉగ్రవాదాన్ని ప్రోత్సహించేందుకు పెద్దకుట్ర పన్నారు. నిందితులు ఉగ్రదాడులకు తమను తాము సిద్ధం చేసుకుంటూ షూటింగ్‌లో శిక్షణ కూడా పొందారు. సీక్రెట్ కమ్యూనికేషన్ యాప్స్ ద్వారా నిందితులు తమ విదేశీ హ్యాండ్లర్‌తో టచ్‌లో ఉన్నట్లు కూడా తేలింది. సాయుధ దోపిడీలు, చోరీలు చేస్తూ నిధులు సేకరించారు. ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహిస్తున్నందుకు హ్యాండ్లర్ల నుంచి డబ్బు కూడా పొందతున్నారు. పూణేలోని కోంధ్వాలో ఐఈడీ ఫ్యాబ్రికేషన్ శిక్షణ పొందారని, నియంత్రిత పేలుడు కూడా చేపట్టారని ఎన్ఐఏ దర్యాప్తులో తేలింది. మహారాష్ట్ర, గుజరాత్ లోని పలు సిటీల్లో ఉగ్రదాడులు చేపట్టేందుకు సిద్ధమయ్యారని వెల్లడైంది. ఈ ఏడాది మార్చిలో ఎన్ఐఏ దాఖలు చేసిన అనుబంధ ఛార్జిషీట్‌లో రిజ్వాన్ అలీతోపాటు మరో ముగ్గురిని నిందితులుగా పేర్కొంది.

Advertisement

Next Story