సందేశ్‌ఖాలీలో ఉద్రిక్తత: కాంగ్రెస్, బీజేపీ నేతలను అడ్డుకున్న పోలీసులు

by samatah |
సందేశ్‌ఖాలీలో ఉద్రిక్తత: కాంగ్రెస్, బీజేపీ నేతలను అడ్డుకున్న పోలీసులు
X

దిశ, నేషనల్ బ్యూరో: పశ్చిమ బెంగాల్‌లోని నార్త్ 24 పరగణాస్ జిల్లాలో సందేశ్‌ఖాలీ లైంగిక వేధింపుల కేసుపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఈ ఘటనపై బీజేపీ చీఫ్ నడ్డా నియమించిన కమిటీ శుక్రవారం సందేశ్ ఖాలీని సందర్శించడానికి ప్రయత్నించగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. అలాగే రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ అధిర రంజన్ చౌదరిని సైతం వెళ్లకుండా అడ్డుకున్నారు. దీంతో కార్యకర్తలకు, పోలీసులకు మధ్య వాగ్వాదం జరగగా.. ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ సందర్భంగా అధిర్ రంజన్ చౌదరి మాట్లాడుతూ..సందేశ్‌ఖలీలోకి ప్రవేశించకుండా ప్రతిపక్ష పార్టీలను ఎందుకు నిలిపివేస్తున్నారో సీఎం మమతా బెనర్జీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. వాస్తవాలేంటో ప్రజలకు తెలపాలని సూచించారు. ఈ కేసును మతపరమైన సంఘటనగా చూపించే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. అంతకుముందు బీజేపీ బృందాన్ని పోలీసులు అపడంతో వారు వెనక్కి వచ్చేశారు. కాగా, సందేశ్‌ఖాలీలో తృణమూల్ కాంగ్రెస్ నాయకుడు షేక్ షాజహాన్, అతని సహచరులు మహిళలపై లైంగిక వేధింపులు, హింస, భూకబ్జాలకు పాల్పడ్డారని ఆరోపణలున్నాయి. ఈ కేసుల ఇప్పటి వరకు 17 మందిని అరెస్టు చేసినట్టు పోలీసులు తెలిపారు. అయితే ముఖ్య నాయకుడు షాజహాన్ మాత్రం పరారీలో ఉన్నట్టు తెలుస్తోంది. మరోవైపు, జాతీయ షెడ్యూల్డ్ కులాల కమిషన్ సందేశ్‌ఖాలీ కేసుపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు నివేదికను అందజేశారు.

Advertisement

Next Story

Most Viewed