SLBC: టన్నెల్ నుంచి కార్మికులను సురక్షితంగా వెలికి తీయండి

by S Gopi |
SLBC: టన్నెల్ నుంచి కార్మికులను సురక్షితంగా వెలికి తీయండి
X

దిశ, నేషనల్ బ్యూరో: శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ ప్రాజెక్ట్‌లో కొంత భాగం కూలిన ఘటనలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. సొరంగంలో చిక్కుకున్న ఇంజనీర్లు, కార్మికుల దగ్గరికి రెస్క్యూ సిబ్బంది చేరుకున్నారని, వారిని బయటకు తీసుకొచ్చే చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు ఆదివారం తెలిపారు. ప్రమాదం జరిగిన ప్రదేశం వద్దకు చేరుకున్న తర్వాత రెస్క్యూ టీమ్‌ చిక్కుకున్న వ్యక్తులను వారి పేర్లతో పిలిచారు, అయితే అటువైపు నుంచి ఎలాంటి స్పందన రాలేదని చెప్పారు. శనివారం ఉదయం 8.30 గంటల ప్రాంతంలో నాగర్‌కర్నూల్ జిల్లా దోమలపెంటకు సుమారు 14 కిలోమీటర్ల దూరంలో నిర్మాణంలో ఉన్న శ్రీశైలం ఎడమ గట్టు కాలువ (ఎస్ఎల్‌బీసీ) సొరంగం పైకప్పు కూలిపోవడంతో ఎనిమిది మంది కార్మికులు చిక్కుకున్న సంగతి తెలిసిందే. తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదివారం ఉదయం సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించారు. సొరంగంలో చిక్కుకున్న వారంతా సురక్షితంగా బయటకు రావాలని ప్రార్థిస్తున్నానని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. సొరంగంలో చిక్కుకున్న వారిలో జార్ఖండ్‌కు చెందిన నలుగురు కార్మికులు కూడా ఉండటంతో ఆ రాష్ట్ర సీఎం హేమంత్ సోరెన్ ఘటనపై స్పందించారు. చిక్కుకున్న వారిని సురక్షితంగా వెలికి తీయాలని, కార్మికులను రక్షించేందుకు అన్ని విధాల సాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు. ప్రాథమిక సమాచారం ప్రకారం సొరంగంలో చిక్కుకున్న జార్ఖండ్‌కు చెందిన నలుగురు కార్మికులు గుమ్లా జిల్లాకు చెందినవారని తెలుస్తోంది. సహాయక చర్యలపై లోక్‌సభ ప్రతిపక్ష, కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ కూడా ఆదివారం ఉదయం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఫోన్‌లో మాట్లాడారు. సహాయక చర్యలతో పాటు నిరంతర నిఘా, పర్యవేక్షణపై తెలంగాణ ప్రభుత్వాన్ని రాహుల్ గాంధీ ప్రశంసించారు. చిక్కుకుపోయిన కార్మికులను రక్షించే విషయంలో ప్రభుత్వం ఎలాంటి చర్యలకైనా రాజీపడొద్దని ఆయన కోరారు.

Next Story

Most Viewed