టీచర్ రిక్రూట్‌మెంట్ స్కామ్‌ వ్యవహారంలో బెంగాల్ ప్రభుత్వానికి ఊరట

by S Gopi |
టీచర్ రిక్రూట్‌మెంట్ స్కామ్‌ వ్యవహారంలో బెంగాల్ ప్రభుత్వానికి ఊరట
X

దిశ, నేషనల్ బ్యూరో: టీచర్ రిక్రూట్‌మెంట్ స్కామ్‌లో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ అధికారుల పాత్రపై విచారణ జరపాలని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ)ని ఆదేశించిన కలకత్తా హైకోర్టు ఆదేశాలపై సుప్రీంకోర్టు సోమవారం స్టే విధించింది. దీంతో ఈ వ్యవహారంలో మమతా బెనర్జీ ప్రభుత్వానికి ఊరట లభించినట్టయింది. బెంగాల్ రాష్ట్రంలో రాజకీయాలను కుదిపేసిన ఈ కుంభకోణంలో ఇటీవల హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. 2016 నాటి స్టేట్ లెవెల్ సెలక్షన్ టెస్ట్(ఎస్ఎల్ఎస్‌టీ) నియామక ప్రక్రియ చెల్లదని కలకత్తా హైకోర్టు పేర్కొంది. ఈ పరీక్ష ద్వారా జరిగిన నియామకాలను తక్షణం రద్దు చేయాలని ఆదేశాలు ఇచ్చింది. అంతేకాకుండా ఆయా ఉద్యోగాలు పొందిన టీచర్లు తన జీతాలని తిరిగిచ్చేయాలని స్పష్టం చేసింది. అలాగే, అప్పటి వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు జరిపి, మూడు నెలల్లోగా నివేదిక అందించాలని సీబీఐని ఆదేశించింది. దీనిపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన దీదీ ప్రభుత్వం, హైకోర్టు ఏకపక్షంగా నియామకాలను రద్దు చేసినట్టు పిటిషన్‌లో వివరించింది. దీనిపై విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం సీబీఐ దర్యాప్తు ఆదేశాలపై స్టే విధించింది. కాగా, 2016లో బెంగాల్ ప్రభుత్వం ప్రభుత్వ ప్రాయోజిత, ఎయిడెడ్ పాఠశాలల్లో 9-12 తరగతుల మధ్య ఉపాధ్యాయులు, గ్రూప్ సీ, గ్రూప్ డీ సిబ్బంది నియామకాలకు పరీక్ష నిర్వహించింది. ఇందులో అవకతవకలు జరిగాయనే ఆరోపణలతో కోర్టులో పిటిషన్‌లు దాఖలయ్యాయి.

Advertisement

Next Story