టీడీపీ, జేడీయూలే కీలకం..ఎన్డీయే, ఇండియా భేటీలపై ఉత్కంఠ

by vinod kumar |
టీడీపీ, జేడీయూలే కీలకం..ఎన్డీయే, ఇండియా భేటీలపై ఉత్కంఠ
X

దిశ, నేషనల్ బ్యూరో: లోక్ సభ ఎన్నికల సమరం ముగిసింది. దాదాపు మూడు నెలలుగా కొనసాగిన ఉత్కంఠకు తెరపడింది. హోరా హోరీగా సాగిన పోరులో చివరకు ఎన్డీయే ఆధిక్యం సాధించింది. 400 సీట్ల నినాదంతో ఎన్నికల ప్రచారంలో దిగిన బీజేపీ స్వల్ప మెజారిటీ మాత్రమే సాధించింది. మెజారిటీకి 272 సీట్లు అవసరం కాగా..ఎన్డీయేకు 291 సీట్లు మాత్రమే వచ్చాయి. అంటే మెజారిటీ కంటే కేవలం 32 సీట్లు మాత్రమే తక్కువ. అదే సమయంలో ఇండియా కూటమికి 235 సీట్లు మాత్రమే వచ్చాయి. అయితే రెండు కూటముల మధ్య సీట్ల వ్యత్యాసం తక్కువగానే ఉండటంతో ప్రభుత్వ ఏర్పాటుపై ప్రయత్నాలు ప్రారంభించాయి. ఎన్డీయే భాగస్వామ్యపక్షాలను ఆకర్షించడానికి ఇండియా, ఇండియా కూటమి పక్షాలను ఆకర్షించేందుకు ఎన్డీయేలు ముమ్మరంగా ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే నేడు ఇండియా, ఎన్డీయే కూటమి నిర్వహించే సమావేశాలపై ఉత్కంఠ నెలకొంది.

ప్రభుత్వ ఏర్పాటుపై బీజేపీ దీమా

మెజారిటీ మార్కును అధిగమించడంతో బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుపై దీమాతో ఉంది. అందుకే కూటమిలోని భాగస్వామ్యపక్షాలతో సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సమావేశానికి హాజరు కావాలని బిహార్ సీఎం నితీశ్ కుమార్, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడులు హాజరుకానున్నట్టు తెలుస్తోంది. ఈ ఎన్నికల్లో టీడీపీ 15, జేడీయూ 12 సీట్లు గెలుచుకున్నారు. ఈ రెండు పార్టీల మద్దతు ప్రస్తుతం ఎన్డీయేకు కీలకంగా మారింది. అయితే వీరు లేకుండా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం కష్టం అవుతుంది. ఒక వేళ వీరు మద్దతు ఇవ్వకపోతే ఎలా అన్నదానిపై కూడా చర్చించనున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో ఇవాళ జరిగే ఎన్డీయే భేటీపై ఆసక్తి నెలకొంది.

ప్రతిపక్షమా? ప్రభుత్వ ఏర్పాటా?

మరోవైపు లోక్‌సభ ఎన్నికల ఫలితాల అనంతరం భవిష్యత్ వ్యూహాన్ని నిర్ణయించడానికి ఇండియా కూటమి సైతం భేటీ అవుతోంది. ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఇతర పార్టీలను ఆకర్షించాలా లేక ప్రతిపక్షంలో కూర్చోవాలా అన్న దానిపై మీటింగ్‌లో డిస్కస్ చేయనున్నారు. ఈ భేటీకి టీఎంసీ కూడా హాజరుకానుండటం గమనార్హం. సమావేశం తర్వాతే తదుపరి వ్యూహం చెబుతామని కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఖర్గే ఫలితాల అనంతరం ప్రకటించారు. అయితే నితీశ్, చంద్రబాబుతో ఎన్డీయే నేతలు సంప్రదింపులు జరుపుతున్నారని పలు కథనాలు వెలువడుతున్నాయి. దీంతో ఇండియా కూటమి నేతల భేటీపైనా ఉత్కంఠ నెలకొంది.

ఓకే విమానంలో ఢిల్లీకి తేజస్వీ, నితీశ్!

ఎన్డీయే, ఇండియా కూటమి సమావేశాలకు హాజరయ్యేందుకు పార్టీల అగ్రనేతలు ఇప్పటికే ఢిల్లీకి పయనమయ్యారు. అయితే జేడీయూ అధినేత నితీశ్ కుమార్, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ లు ఒకే విమానంలో ఢిల్లీకి వెళ్తున్నట్టు తెలుస్తోంది. రెండు కూటముల సమావేశం వేళ ఈ పరిణామం చోటుచేసుకోవడం సంచలనంగా మారింది. అయితే నితీశ్ ఎన్డీయేలోనే కొనసాగుతారని జేడీయూ అగ్రనేత కేసీ త్యాగి వెల్లడించారు.

Advertisement

Next Story

Most Viewed