తమిళనాడు కల్తీ మద్యం ఘటన..33కు చేరిన మృతుల సంఖ్య

by vinod kumar |
తమిళనాడు కల్తీ మద్యం ఘటన..33కు చేరిన మృతుల సంఖ్య
X

దిశ, నేషనల్ బ్యూరో: తమిళనాడులోని కళ్లకురిచి జిల్లాలో కల్తీ మద్యం తాగి మరణించిన వారి సంఖ్య 33కు చేరుకుంది. సుమారు 70 మందికి పైగా ఆస్పత్రి పాలయ్యారు. మరణించిన వారి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ ఘటనను సీఎం ఎంకే స్టాలిన్ సీరియస్ గా తీసుకున్నారు. జిల్లా కలెక్టర్‌ కలెక్టర్ శ్రావణ్ కుమార్ జాతావత్‌ను ట్రాన్స్‌ఫర్ చేశారు. అలాగే జిల్లా పోలీస్ సూపరిండెంట్‌ సమయ్ సింగ్ మీనా సస్పెండ్ చేశారు. ఘటనపై సీబీ-సీఐడీ దర్యాప్తునకు ఆదేశించారు. బాధితులను మెరుగైన వైద్యం అందించాలని తెలిపారు.

దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు ఇప్పటికే ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. సుమారు 200 లీటర్ల నకిలీ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. దీనిని ఫోరెన్సిక్ నిపుణులతో పరీక్షించగా మిథనాల్ కలిపి ఉన్నట్టు నిర్ధారణైంది. గతేడాది కూడా మిథనాల్‌ తాగి తమిళనాడులో 22 మంది చనిపోయారు. అన్నాడీఎంకే అధినేత ఎడప్పాడి పళనిస్వామి అధికార డీఎంకేపై విమర్శలు గుప్పించారు. ఈ సమస్యను తాను పలుమార్లు ప్రభుత్వానికి చెప్పినప్పటికీ దీనిని అరికట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందన్నారు. కల్తీ లిక్కర్‌ దందాను అరికట్టడానికి కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం స్టాలిన్‌కు విజ్ఞప్తి చేశారు.

Advertisement

Next Story

Most Viewed