Tamil fishermen: బలవంతంగా గుండు చేశారు, చిత్రహింసలు పెట్టారు.. శ్రీలంక నేవీపై మత్స్యకారుల సంచలన ఆరోపణలు

by vinod kumar |
Tamil fishermen: బలవంతంగా గుండు చేశారు, చిత్రహింసలు పెట్టారు.. శ్రీలంక నేవీపై మత్స్యకారుల సంచలన ఆరోపణలు
X

దిశ, నేషనల్ బ్యూరో: సముద్ర సరిహద్దు దాటినందుకు గాను తమిళనాడుకు చెందిన ఎనిమిది మంది మత్స్యకారులను శ్రీలంక నేవీ గత నెల 27న అదుపులోకి తీసుకుంది. వారి పడవను సైతం స్వాధీనం చేసుకుంది. సెప్టెంబర్ 5న ఈ కేసును విచారించిన శ్రీలంక కోర్టు రూ. 50,000 జరిమానా చెల్లించి ఐదుగురు మత్స్యకారులను విడుదల చేయాలని ఆదేశించింది. మరో ముగ్గురు రెండో సారి అరెస్ట్ అయినందున వారికి ఆరు నెలల జైలు శిక్ష విధించింది. అయితే తాజాగా ఐదుగురు మత్స్యకారులు ఇంటికి తిరిగి వచ్చారు. ఈ నేపథ్యంలోనే వారు శ్రీలంక నేవీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తమకు శ్రీలంక నేవీ బలవంతంగా తీసుకెళ్లి గుండు కొట్టించిందని, అంతేగాక చిత్ర హింసలకు గురి చేసిందని ఆరోపించారు.

జైలు పరిసరాలను, డ్రయినేజీని మొత్తం తమతోనే శుభ్రం చేయించారని తెలిపారు. భారతీయులమని వారికి తెలియగానే ఎంతో కోపంతో మాట్లాడేవారని వెల్లడించారు. జీవనోపాధి నిమిత్తం చేపలు పట్టడానికి వెళ్లే వారిని అరెస్టు చేయడం సరికాదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటన బాధిత కుటుంబాల్లో కలకలం రేపింది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా న్యాయం చేయాలని, దౌత్యపరమైన జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు. మరోవైపు ఆరు నెలల జైలుశిక్ష పడిన మిగిలిన ముగ్గురు మత్స్యకారుల కుటుంబాలు ఆందోళన చెందుతున్నాయి.

Advertisement

Next Story