ఉగ్రవాదం అంతం కోసం పాక్‌తో చర్చలే ఏకైక మార్గం: ఫరూక్ అబ్దుల్లా

by Harish |
ఉగ్రవాదం అంతం కోసం పాక్‌తో చర్చలే ఏకైక మార్గం: ఫరూక్ అబ్దుల్లా
X

దిశ, నేషనల్ బ్యూరో: జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదాన్ని అంతం చేయడానికి పాకిస్తాన్‌తో చర్చలు జరపడమే ఏకైక మార్గం అని నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూఖ్ అబ్దుల్లా బుధవారం అన్నారు. మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన, పాక్‌లో ఏర్పడిన కొత్త ప్రభుత్వం మనతో శాంతియుత వాతావరణాన్ని కలిగి ఉండటానికి సిద్ధంగా ఉంది, వారికి భారత్ తలుపులు తెరవాలని, పాకిస్తాన్‌తో చర్చలను తిరిగి ప్రారంభించాలని కోరారు. పొరుగు దేశాలతో మనకు సమస్యలు ఉన్నాయి. సైనిక చర్యల ద్వారా అవి పరిష్కారం కావు. వారితో మాట్లాడితేనే వాటిని పరిష్కరించగలం. ఉగ్రవాదులు సరిహద్దుల గుండా వస్తూనే ఉన్నారు. ఏ ప్రభుత్వం వచ్చిన కూడా ఇదే పరిస్థితి ఉంటుంది. వీటి నుంచి బయటపడటానికి చర్యలు తీసుకోవాలని ఫరూఖ్ అబ్దుల్లా అన్నారు.

భారత్-పాకిస్తాన్ మధ్య అవగాహన ఉంటే తప్ప ఉగ్రవాదం అంతం కాదని నేను ఎప్పుడూ చెబుతూనే ఉన్నాను, ఉగ్రవాదం కొనసాగుతుంది, మనం దానిని ఎదుర్కోవలసి ఉంటుంది. విషాదం ఏమిటంటే. దీని కారణంగా అమాయకులు చనిపోతున్నారు.. అది దురదృష్టకరం. తొందరగా మేల్కొని, దీనికి పరిష్కారం కనుగొనకపోతే మరింత మంది అమాయకులు ప్రాణాలు కోల్పోతారని ఆయన అన్నారు.

గత కొద్ది రోజులుగా జమ్మూకశ్మీర్‌‌లో ఉగ్రదాడులు ఎక్కువగా జరుగుతున్నాయి. ఆదివారం నాడు, యాత్రికులు ప్రయాణిస్తున్న బస్సుపై దాడి చేయడంతో తొమ్మిది మంది మరణించగా, 41 మంది గాయపడ్డారు. దోడాలోని జాయింట్ చెక్‌పోస్ట్‌పై ఉగ్రవాదులు దాడి చేయగా ఆరుగురు భద్రతా సిబ్బందికి గాయాలయ్యాయి. రెండో సారి విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MEA) బాధ్యతలు స్వీకరించిన తర్వాత, జైశంకర్ మంగళవారం మాట్లాడుతూ, పాకిస్తాన్ నుంచి వస్తున్న సీమాంతర ఉగ్రవాదాన్ని పరిష్కరించడానికి ప్రయత్నాలు జరుగుతాయని అన్నారు. చైనాతో వాస్తవ నియంత్రణ రేఖ (ఎల్‌ఎసి) వెంబడి మిగిలిన సమస్యల పరిష్కారంపై భారత్ దృష్టి సారిస్తుందని కూడా జైశంకర్ చెప్పారు

Advertisement

Next Story

Most Viewed