Raghav Chadha: ఏఐ గురించే కాకుండా ఏక్యూఐ గురించి కూడా మాట్లాడండి- రాఘవ్ చడ్డా

by Shamantha N |   ( Updated:2024-12-03 11:15:17.0  )
Raghav Chadha: ఏఐ గురించే కాకుండా ఏక్యూఐ గురించి కూడా మాట్లాడండి- రాఘవ్ చడ్డా
X

దిశ, నేషనల్ బ్యూరో: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) గురించి కాకుండా ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) గురించి మాట్లాడాలని ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ ఎంపీ రాఘవ్ చడ్డా(AAP Rajya Sabha MP Raghav Chadha) అన్నారు. పార్లమెంటులో ఢిల్లీ వాయుకాలుష్యం అంశాన్ని రాఘవ్ చడ్డా లేవనెత్తారు. "మేం ఏఐ గురించి మాట్లాడుతాం. కానీ, మనం కాలుష్యం నుండి బయటపడాలంటే ఏక్యూఐ గురించి మాట్లాడవలసి ఉంటుంది" అని చెప్పారు. దేశ రాజధాని ఢిల్లీలో వాయు నాణ్యత (AQI) క్షీణించేందుకు పంటలు కాల్చడం ఒక్కటే కారణం కాదని అన్నారు. రైతులకు వేరే మార్గం లేకపోవడంతోనే పంటలను తగులబెట్టాల్సి వస్తోందని చెప్పారు. "రైతులకు పంట వ్యర్థాలు తగులబెట్టడం తప్పనిసరి. ఢిల్లీలో వాయు కాలుష్యానికి రైతులు బాధ్యత వహించరు" అని చడ్డా ఐఐటీ అధ్యయనాన్ని ఉటంకిస్తూ అన్నారు.

తాత్కాలిక పరిహారం చెల్లించాలి

'హ్యాపీ సీడర్' లేదా 'పాడీ ఛాపర్' వంటి కాలుష్య నిరోధక పరికరాలను కొనుగోలు చేయడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు ఆర్థిక సహాయం చేయాలన్నారు. త్వరితగతిన పరిష్కారం కింద రైతులకు ఎకరానికి రూ. 2,500 అందించాలన సూచించారు. కేంద్రం నుండి రూ. 2వేలు, పంజాబ్ ప్రభుత్వం నుంచి రూ.500 ఇవ్వాలని అన్నారు. ఇకపోతే, ఈ ఏడాది ఢిల్లీలో వాయుకాలుష్యం తీవ్రంగా పెరిగిపోయింది. ఢిల్లీలో ఏక్యూఐ 500కి చేరింది. దీంతో, ఢిల్లీ ప్రభుత్వం గ్రాప్-4 (GRAP 4)ని అమలు చేయాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలోనే రాఘవ్ చడ్డా పార్లమెంటులో కాలుష్యం గురించి ప్రస్తావించారు.

Advertisement

Next Story

Most Viewed