Delhi Coaching Center Deths: వర్షాకాలంలో డ్రైవింగ్ చేస్తున్నారా?.. ఢిల్లీ సివిల్స్ అభ్యర్థుల మరణం వెనుక ఓ నిర్లక్ష్యపు డ్రైవింగ్ కోణం!

by Prasad Jukanti |   ( Updated:2024-07-29 12:54:05.0  )
Delhi Coaching Center Deths: వర్షాకాలంలో డ్రైవింగ్ చేస్తున్నారా?.. ఢిల్లీ సివిల్స్ అభ్యర్థుల మరణం వెనుక ఓ నిర్లక్ష్యపు డ్రైవింగ్ కోణం!
X

దిశ, డైనమిక్ బ్యూరో: పెరిగిపోతున్న వాహనాల రద్దీతో ప్రస్తుత కాలంలో డ్రైవింగ్ చేయడం అంత సులువైన పని కాదు. వర్షకాలంలో అయితే మరీ డేంజర్. ఒళ్లంతా కళ్లు చేసుకుని వాహనాలు నడిపినా ఏదో రూపంలో ప్రమాదాలు చుట్టుముడుతూనే ఉంటాయి. ఇదిలా ఉంటే మరికొంత మంది తమ నిర్లక్ష్యపు డ్రైవింగ్ తో తమ ప్రాణాలకే కాదు ఎదుటివారి ప్రాణాలను రిస్క్ లో పెడుతుంటారు. మరి కొందరు తోటి వాహనదారులపై వర్షం నీరు చిమ్ముతుందని తద్వారా వారు ప్రమాదాల బారిన పడే అవకాశం ఉంటుందనే ఆలోచన లేకుండా వేగంగా దూసుకువస్తుంటారు. ఇప్పుడీ చర్చ అంత దేనికంటే దేశ రాజధాని ఢిల్లీలోని ఓ ఐఏఎస్ కోచింగ్ సెంటర్ బేస్ మెంట్ లోకి వరద నీరు పోటెత్తి ముగ్గురు సివిల్స్ అభ్యర్థులు దుర్మరణం చెందిన సంగతి తెలిసిందే కదా. అయితే వీరి మరణం వెనుక ఓ నిర్లక్ష్యపు డ్రైవింగ్ కోణం ఉందని పోలీసులు వెల్లడించారు. కోచింగ్ సెంటర్ ఘటనపై ఇవాళ ఢిల్లీ పోలీసులు ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు. ఇందులో ప్రమాద సమయంలో కోచింగ్ సెంటర్ ముందు నుంచి ఓ ఎస్ యూవీ వాహనాన్ని డ్రైవ్ చేసిన వ్యక్తి సైతం ఉండటం గమనార్హం. ఈ వ్యవహారంలో ఓ కారు డ్రైవర్ ను అరెస్ట్ చేయడం ఇప్పుడు దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు దారి తీస్తున్నది. దీంతో వర్షంలో వేగంగా కారును నడిపారని పోలీసులు చెబుతున్న వాదన కోర్టులో ఎంత వరకు నిలబడుతుంది? ప్రజాభిప్రాయం ఎటువైపు నిలుస్తుంది అనేది ఉత్కంఠగా మారింది.

కారు స్పీడ్ తో బేస్ మెంట్ లోకి వరద నీరు:

ఢిల్లీ ఘటనకు సంబంధించి తాజాగా రెండు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇందులో ఎస్ యూవీ డ్రైవర్ నిర్లక్ష్యం కూడా ఉందని పోలీసులు చెబుతున్నారు. శనివారం రాత్రి భారీ వర్షంతో వరద పోటెత్తిన సమయంలో ఆ కోచింగ్ సెంటర్ ముందు సదరు కారును డ్రైవర్ వేగంగా తీసుకువెళ్లాడు. దీంతో ఒక్కసారిగా ఒత్తిడి పెరిగి వరద ప్రవాహం మరింత వేగంగా ఆ గేట్ వైపు దూసుకుపోవడంతో గేట్ విరిగిపోయింది. దాంతో వరద నీరు మరింత వేగంగా సెల్లార్ లోకి వెళ్లింది. వైరల్ అవుతున్న వీడియో ఆధారంగా డ్రైవర్ నిర్లక్ష్యాన్ని నిర్ధారించామని వేగంగా వెళ్తున్న ఆ డ్రైవర్ ను ఒక వీధి ప్యాపారి ఆపడానికి ప్రయత్నించినా అతడు ఆగలేదని సీనియర్ పోలీస్ అధికారి మీడియాకు చెప్పినట్లు జాతీయ మీడియా తన కథనంలో పేర్కొంది. వీడియో ప్రారంభంలో కోచింగ్ ఇనిస్టిట్యూట్ గేట్ బాగానే ఉంది. కానీ కారు వేగంగా దాటి వెళ్లినన తర్వాత ఆ గేట్ విరిగి కిందపడింది. నిందితుడు డ్రైవర్‌కు కోచింగ్ యజమాని లేదా బిల్డింగ్ యజమానితో ఎటువంటి సంబంధం లేదని పోలీసులు తెలిపారు.

సోషల్ మీడియాలో బిగ్ డిబెట్:

ఎస్ యూవీ డ్రైవర్ ను అరెస్ట్ చేయడం పట్ల సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున డిబేట్ జరుగుతున్నది. పలువురు నెటిజన్లు ఈ అరెస్టును ప్రశ్నిస్తున్నారు. ఇన్టిట్యూట్ గేట్ కు రెయిలింగ్ లు ఉన్నాయని కారు వేగంగా వెళ్లకపోయినా నీటి ప్రవాహాన్ని ఆపడం సాధ్యం కాదు అని కామెంట్లు చేస్తున్నారు. అసలు ఈ ఘటనకు కారు డ్రైవర్ కు సంబంధం ఏంటని ఓ నెటిజన్ ప్రశ్నించగా మరో నెటిజన్ స్పందిస్తూ.. భవనం సెల్లార్ లో వ్యక్తులు చిక్కుకుపోయినట్లు కారు డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తికి ఏదైనా క్లూ ఉందా? భద్రతా ప్రమాణాలు లేకుండా నేలమాళిగలో సంస్థను నడుపుతున్న వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాడు. కారు వ్యక్తిని బలిబశువును చేస్తున్నారని ఒకరు, వేగంగా నడిపితే చలావ్ వేయాలని మరొకరు భిన్నాభిప్రాయాలతో కామెంట్స్ చేస్తున్నారు. మొత్తంగా ఈ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. మొత్తంగా వర్షకాలంలో వాహనాలను నడిపే వారికి ఈ ఘటన ఈ హెచ్చరికగా మారిందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

Advertisement

Next Story

Most Viewed