ఎల్ఎంవీ లైసెన్స్‌తో ట్రాన్స్ పోర్టు వాహనాలూ నడపొచ్చు.. సుప్రీంకోర్టు కీలక తీర్పు

by vinod kumar |   ( Updated:2024-11-06 13:44:46.0  )
ఎల్ఎంవీ లైసెన్స్‌తో ట్రాన్స్ పోర్టు వాహనాలూ నడపొచ్చు.. సుప్రీంకోర్టు కీలక తీర్పు
X

దిశ, నేషనల్ బ్యూరో: లైట్‌ మోటార్‌ వెహికల్‌ (Lmv) డ్రైవింగ్‌ లైసెన్స్‌ (Driving lisence) ఉన్న వ్యక్తి 7,500 కిలోల బరువున్న ట్రాన్స్‌పోర్ట్ వాహనాన్ని నడపడానికి అర్హుడేనని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. దేశంలో పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలకు ఎల్‌ఎంవీ లైసెన్స్ హోల్డర్లే కారణమని రుజువు చేసేందుకు ఎటువంటి డేటా లేదని పేర్కొంది. ఈ వాహనాలు నడిపేందుకు ఎల్‌ఎంవీ హోల్డర్లకు అవకాశం కల్పిస్తూ త్రిసభ్య ధర్మాసనం 2017లో తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఇన్సూరెన్స్ కంపెనీలు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి. దీనిపై సీజేఐ చంద్రచూడ్ నేతృత్వంలోని న్యాయమూర్తులు హృషికేష్ రాయ్, పీఎస్ నరసింహ, పంకజ్ మిథాల్, మనోజ్ మిశ్రాలతో కూడిన ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం విచారణ చేపట్టి తీర్పు వెలువరించింది. ఎల్ఎంవీ లైసెన్స్ ఉన్న వ్యక్తి బస్సు, ట్రక్కు, రోడ్ రోలర్‌ను నడపొచ్చని స్పష్టం చేసింది. 7,500 కిలోల బరువున్న వాహనాలను నడపడానికి డ్రైవర్లకు ప్రత్యేకంగా ఎలాంటి రూల్స్ అవసరం లేదని తెలిపింది.

రోడ్డు భద్రత తీవ్రమైన ప్రజా సమస్య అని, ఈ ప్రమాదాల కారణంగా 2023లోనే 1.7 మిలియన్లకు పైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయారని తెలిపింది. మోటారు వాహనాల చట్టం కింద పేర్కొన్న అదనపు శిక్షణ, అర్హత ప్రమాణాలు 7,500 కిలోల కంటే తక్కువ బరువున్న వాహనాలను నడపాలనుకునే వ్యక్తులకు వర్తిస్తాయని పేర్కొంది. ప్రమాదకరమైన వస్తువులను తీసుకెళ్లే వాహనాలకు మాత్రం ప్రత్యేక అర్హతలు ఉంటాయని తెలిపింది. ఈ అంశం డ్రైవర్ల జీవనోపాధికి సంబంధింనది కాబట్టి చట్టంలో పలు సవరణలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని కోరింది. ఈ అంశం మంత్రిత్వ శాఖ వద్ద పెండింగ్‌లో ఉందని సవరణలను సరైన సమయంలో నోటిఫై చేస్తామని అడ్వకేట్ జనరల్ వెంకటరమణి కోర్టుకు తెలిపారు.

కాగా, 2017లో ముకుంద్ దేవాంగన్ కేసులో కేసులో భాగంగా ఎల్ఎంవీ లైసెన్స్ ఉన్నవారు 7500 కేజీల కంటే తక్కువ బరువున్న వాహనాన్ని నడపొచ్చని త్రిసభ్య ధర్మాసనం తెలిపింది. అయితే దీనికి అనుమతించడం వల్ల ఎల్ఎంవీ లైసెన్స్ ఉన్న వ్యక్తి బస్సు, ట్రక్కు, రోడ్ రోలర్ నడిపితే ప్రమాదాలు పెరుగుతాయని, దీనివల్ల ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు నష్టపరిహారం చెల్లించడానికి సైతం కంపెనీలపై భారం పడతాయని భావించిన బీమా కంపెనీలు ఆ తీర్పులు సవాల్ చేశాయి. దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసనం అంతకుముందు తీర్పును సమర్థించింది.

Advertisement

Next Story

Most Viewed