Manmohan Singh: నా జీవితంలో ఎంతో ముఖ్యమైన గురువుని కోల్పోయా- రాహుల్ గాంధీ

by Shamantha N |
Manmohan Singh: నా జీవితంలో ఎంతో ముఖ్యమైన గురువుని కోల్పోయా- రాహుల్ గాంధీ
X

దిశ, నేషనల్ బ్యూరో: మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ (Manmohan Singh) పార్థివ దేహానికి కాంగ్రెస్‌ అగ్ర నాయకులు సోనియా గాంధీ(Sonia Gandhi), మల్లిఖార్జున ఖర్గే(Mallikarjun Kharge), రాహుల్‌ గాంధీ(Rahul Gandhi) నివాళులు అర్పించారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. రాహుల్‌ గాంధీ మాట్లాడుతూ ‘‘మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా అపారమైన జ్ఞానం, సమగ్రతతో భారతదేశాన్ని అభివృద్ధి వైపు నడిపించారు. ఆయనలోని వినయం, ఆర్థికశాస్త్రంపై ఆయనకున్న లోతైన అవగాహన దేశానికి స్ఫూర్తినిచ్చాయి. వారి కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. నా జీవితంలో ఎంతో ముఖ్యమైన ఓ గురువును కోల్పోయాను’’ అని అన్నారు.

నివాళులర్పించిన ప్రియాంక గాంధీ

అలాగే, వయనాడ్ కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా(Priyanka Gandhi Vadra)తో పాటు ఆమె ఆమె భర్త రాబర్ట్‌ వాద్రా సైతం మన్మోహన్‌ సింగ్ నివాసానికి చేరుకుని ఘన నివాళులర్పించారు. మీడియాతో రాబర్ట్‌ వాద్రా మాట్లాడుతూ.. మన్మోహన్‌ సింగ్ ఎల్లప్పుడూ ప్రజల గురించే ఆలోచిస్తూ దేశ అభివృద్ధికి కృషి చేసే వారని చెప్పుకొచ్చారు. ఆర్థిక రంగంలో అనేక విషయాలపై ఆయనకు చాలా పరిజ్ఞానం ఉందని పేర్కొన్నారు. ఇకపోతే, మన్మోహన్‌ సింగ్‌ యూపీఏ హయాంలో 2004 నుంచి 2014 వరకు ప్రధానిగా పని చేశారు. కాంగ్రెస్‌ పార్టీతో, గాంధీ కుటుంబంతో మన్మోహన్‌కు మంచి సంబంధాలు ఉన్నాయి. గురువారం రాత్రి ఆయన చనిపోయినట్లు తెలియడంతోనే సీడబ్ల్యూసీ సమావేశాలను మధ్యలోనే ముగించి.. ఖర్గే, రాహుల్ గాంధీ వెంటనే ఢిల్లీకి బయల్దేరారు. ఇక, ఢిల్లీలోని ఉన్న సోనియా, ప్రియాంక ఎయిమ్స్ కి చేరుకున్నారు. ప్రస్తుతం మన్మోహన్‌ పార్థివదేహాన్ని ఆయన నివాసంలోనే ఉంచారు. ప్రజల సందర్శనార్థం శనివారం ఆయన భౌతికకాయాన్ని ఏఐసీసీ ప్రధాన కార్యాలయానికి తీసుకురానున్నారు. శనివారం రాజ్‌ఘాట్‌ సమీపంలో ఆయన అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నారు.

Advertisement

Next Story

Most Viewed