'రాజకీయ విభేదాలు పక్కన పెట్టండి'.. కేజ్రీవాల్, సక్సేనాలకు సుప్రీం చురకలు

by Vinod kumar |   ( Updated:2023-07-17 14:34:56.0  )
రాజకీయ విభేదాలు పక్కన పెట్టండి.. కేజ్రీవాల్, సక్సేనాలకు సుప్రీం చురకలు
X

న్యూడిల్లీ: ఢిల్లీలో రాష్ట్రంలోని ఆమ్ ఆద్మీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, లెఫ్టినెంట్ గవర్నర్‌ల మధ్య జరుగుతున్న త్రిముఖ పోరాటానికి అంతం పలకాలని సుప్రీం కోర్టు సూచించింది. ముఖ్యంగా సీఎం కేజ్రీవాల్, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా తమ రాజకీయ విభేదాలను పక్కన పెట్టాలని, రాజధానిలో పాలనపై ఏకగ్రీవ నిర్ణయాలు తీసుకోవాలని స్పష్టం చేసింది. ఢిల్లీ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ (డీఈఆర్‌సీ) చైర్‌పర్సన్ నియామకంపై ఇద్దరూ కూర్చొని నిర్ణయం తీసుకోవాలని తెలిపింది. డీఈఆర్‌సీ చైర్‌పర్సన్‌గా మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఉమేష్ కుమార్‌ను లెఫ్టినెంట్ గవర్నర్ ఏకపక్షంగా నియమించారంటూ ఢిల్లీ సర్కారు దాఖలు చేసిన పిటిషన్‌తో పాటు ప్రభుత్వ ఉన్నతాధికారుల నియామకంపై సుప్రీం కోర్టు జారీ చేసిన ఆర్డినెన్స్‌పై రాష్ట్ర ప్రభుత్వ సవాల్‌ను సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని సుప్రీం కోర్టు ధర్మాసనం సోమవారం విచారించింది.

అలహాబాద్ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఉమేష్ కుమార్‌ను డీఈఆర్సీ చైర్ పర్సన్‌గా నియమిస్తూ.. గత నెల 21వ తేదీన కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీన్ని ఢిల్లీ ప్రభుత్వం సుప్రీం కోర్టులో సవాల్ చేసింది. రాష్ట్ర పరిధిలో ఉన్న సంస్థలకు ఉన్నతాధికారులను నియమించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికే ఉందంటూ మే 11వ తేదీన సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ ఆర్డినెన్స్ చెల్లుబాటు కాదని కేజ్రీవాల్ సర్కారు వాదించింది. ఆ తీర్పుపై స్పందనను రెండు వారాల్లో తెలపాలని కేంద్ర ప్రభుత్వానికి, లెఫ్టినెంట్ గవర్నర్‌కు అత్యున్నత న్యాయస్థానం సూచించింది. అయితే.. కేంద్ర తన స్పందనను ఇంతవరకూ దాఖలు చేయలేదని ఢిల్లీ సర్కారు తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ కోర్టుకు చెప్పారు. దీంతో కేసును గురువారానికి వాయిదా వేసిన కోర్టు ఆలోగా స్పందనను తెలపాలని కేంద్రాన్ని ఆదేశించింది.

Advertisement

Next Story

Most Viewed