Electoral Bonds : ఎలక్టోరల్‌ బాండ్లపై ‘సిట్‌’ విచారణకు ‘సుప్రీం’ నో

by Hajipasha |
Electoral Bonds : ఎలక్టోరల్‌ బాండ్లపై ‘సిట్‌’ విచారణకు ‘సుప్రీం’ నో
X

దిశ, నేషనల్ బ్యూరో: ఎలక్టోరల్‌ బాండ్ల ద్వారా రాజకీయ పార్టీలు స్వీకరించిన విరాళాల వ్యవహారంపై కోర్టు పర్యవేక్షణలోని ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్)తో విచారణ చేయించాలంటూ దాఖలైన నాలుగు పిటిషన్లను సుప్రీంకోర్టు తిరస్కరించింది. సాధారణ చట్టం కింద చర్యలు తీసుకునే మార్గాలు ఉన్నప్పటికీ.. దీనిపై మాజీ న్యాయమూర్తితో విచారణకు ఆదేశించడం అనుచితమే అవుతుందని దేశ సర్వోన్నత న్యాయస్థానం పేర్కొంది. ఆర్టికల్‌ 32 ప్రకారం ఈ దశలో జోక్యం చేసుకోవడం కూడా తొందరపాటే అవుతుందని తెలిపింది. ఎన్నికల బాండ్ల ద్వారా రాజకీయ పార్టీలు, కార్పొరేట్‌ కంపెనీల మధ్య క్విడ్‌ ప్రోకో జరిగిందంటూ వచ్చిన ఆరోపణలపై కోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరిపించాలని దాఖలైన నాలుగు ప్రజా ప్రయోజన వ్యాజాలను సుప్రీంకోర్టు శుక్రవారం విచారించింది. ఎన్నికల బాండ్ల ద్వారా రాజకీయ పార్టీలు స్వీకరించిన విరాళాల రికవరీతో పాటు వాటి ఆదాయపన్ను మదింపులను తిరిగి తెరవాలన్న పిటిషనర్ల వాదనతో న్యాయస్థానం విభేదించింది. అవన్నీ ఆదాయపు పన్ను శాఖ అధికారులు తీసుకోవాల్సిన చర్యలని పేర్కొంది. ఈమేరకు భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌, జస్టిస్‌ జేబీ పార్దీవాలా, జస్టిస్‌ మనోజ్‌ మిశ్రాలతో కూడిన ధర్మాసనం తీర్పును వెలువరించింది. రాజకీయ పార్టీలు నిధులను సమకూర్చేకునేందుకు ఉద్దేశించిన ఎన్నికల బాండ్ల స్కీం రాజ్యాంగ విరుద్ధమని ఈ ఏడాది ఫిబ్రవరిలోనే సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఎన్నికల బాండ్ల జారీని బ్యాంకులు తక్షణమే నిలిపివేయాలని అప్పట్లో న్యాయస్థానం ఆదేశించింది. విరాళాలు ఇచ్చినవారి వివరాలను బయటపెట్టని ఎన్నికల బాండ్లను స్వీకరించడం అంటే సమాచార హక్కును ఉల్లంఘించడమే అని దేశ సర్వోన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది.

ఎన్నికల బాండ్లు అంటే ?

రాజకీయ పార్టీల విరాళాల సేకరణ ప్రక్రియలో పారదర్శకతను తీసుకొచ్చేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం 2018లో ఎన్నికల బాండ్ల పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. రాజకీయ పార్టీలు తాము స్వీకరించిన విరాళాల వివరాలను బహిర్గతం చేయాల్సిన అవసరం లేదని కేంద్ర ప్రభుత్వం ఆర్థిక చట్టం-2017లో సవరణ చేసింది.ఆ సవరణ వల్ల ఎన్నికల బాండ్ల విధానంలో పారదర్శకత లోపించిందనే విమర్శలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే ఈ పథకాన్ని సవాల్ చేస్తూ పిటిషన్లు దాఖలయ్యాయి. ఎన్నికల బాండ్లు ఒక ప్రామిసరీ నోట్‌ లాంటివి. వాటిని దేశంలోని పలు నగరాల్లో ఉన్న స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాకు చెందిన ఎంపిక చేసిన బ్రాంచ్‌లలో జారీ చేసేవారు. వ్యక్తులు, కంపెనీలు వీటిని కొనుగోలు చేయొచ్చు. అలా కొనుగోలు చేసిన బాండ్లను తమకు నచ్చిన రాజకీయ పార్టీలకు విరాళంగా ఇవ్వొచ్చు. రాజకీయ పార్టీలు ఆ బాండ్లను నగదుగా మార్చుకొని తమ కార్యక్రమాల కోసం వాడుకుంటాయి.

Advertisement

Next Story

Most Viewed