ఈ టైంలో బైపోలా.. పుణె లోక్‌సభ ఉప ఎన్నికపై సుప్రీం స్టే

by Hajipasha |
ఈ టైంలో బైపోలా.. పుణె లోక్‌సభ ఉప ఎన్నికపై  సుప్రీం స్టే
X

దిశ, నేషనల్ బ్యూరో : పూణే లోక్‌సభ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించాలంటూ బాంబే హైకోర్టు గత నెలలో ఇచ్చిన ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే విధించింది. ప్రస్తుత లోక్‌సభ పదవీకాలం ఈ ఏడాది జూన్‌ 16తో ముగియనున్న తరుణంలో పూణే స్థానానికి బైపోల్ నిర్వహించడం అనేది వృథా ప్రయాసే అవుతుందని కేంద్ర ఎన్నికల సంఘం వినిపించిన వాదనతో కోర్టు ఏకీభవించింది. ఈసీ వాదనను పరిగణనలోకి తీసుకున్న భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డి.వై. చంద్రచూడ్‌ నేతృత్వంలోని ధర్మాసనం.. పూణే స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించాలంటూ బాంబే హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను నిలుపుదల చేసింది. 2023 మార్చి 29న ఖాళీ అయిన పూణే స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించడం ఎందుకు ఆలస్యమైందని ఈసీని ప్రశ్నించింది. దీనిపై తదుపరి విచారణను మార్చి లేదా ఏప్రిల్‌లో చేపడుతామని వెల్లడించింది.

పూణేలోనే బైపోల్ ఎందుకు జరగలేదు ?

గత నెలలో ఈ కేసును విచారించిన బాంబే హైకోర్టు.. ప్రజాస్వామ్య పాలనలో నిర్ణీత కాలానికి మించి నియోజకవర్గాలు ప్రజాప్రతినిధుల ప్రాతినిధ్యం లేకుండా ఖాళీగా ఉండటం తగదని వ్యాఖ్యానించింది. పూణే స్థానం ఖాళీ అయిన నాటి నుంచి పలు అసెంబ్లీ, లోక్‌సభ స్థానాలకు ఈసీ ఉప ఎన్నికలు నిర్వహించిన విషయాన్ని గుర్తుచేసింది. పూణే విషయంలో ఈసీ చెప్పిన వివరణ అస్థిరంగా ఉందని తప్పుపట్టింది. కాగా, పూణే ఎంపీ గిరీశ్‌ బాపత్‌ గతేడాది మార్చిలో మరణించడంతో ఆ స్థానం ఖాళీ అయింది.

Advertisement

Next Story

Most Viewed