రేపు సాయంత్రం 5గంటల లోపు విధుల్లో చేరాలి.. వైద్యులకు సుప్రీంకోర్టు అల్టిమేటం

by vinod kumar |   ( Updated:2024-09-09 10:34:39.0  )
రేపు సాయంత్రం 5గంటల లోపు విధుల్లో చేరాలి.. వైద్యులకు సుప్రీంకోర్టు అల్టిమేటం
X

దిశ, నేషనల్ బ్యూరో: కోల్‌కతాలోని ఆర్‌జీ కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లో ట్రైనీ డాక్టర్ పై జరిగిన లైంగిక దాడి, హత్య ఘటనను నిరసిస్తూ ఆందోళన చేస్తున్న వైద్యులకు సుప్రీంకోర్టు అల్టిమేటం జారీ చేసింది. మంగళవారం సాయంత్రం 5గంటలోగా విధుల్లో చేరాలని ఆదేశించింది. ఈ టైంలోగా డ్యూటీలో చేరితే వారిపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా చూస్తామని తెలిపింది. లేదంటే రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే చర్యలను ఆపలేమని స్పష్టం చేసింది. ఈ వ్యవహారంపై దాఖలైన సుమోటో కేసును సీజేఐ చంద్రచూడ్, న్యాయమూర్తులు జేబీ పార్దివాలా, మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. గడువులోగా డాక్టర్లు డ్యూటీలో చేరడంలో విఫలమైతే, వారిపై క్రమశిక్షణా చర్యలు తీసుకునే స్వేచ్ఛ రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుందని పేర్కొంది.

పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం సైతం డాక్టర్ల భద్రతపై విశ్వాసం కలిగించేలా చర్యలు తీసుకోవాలని ధర్మాసనం తెలిపింది. ప్రత్యేక డ్యూటీ గదులు, టాయిలెట్ సౌకర్యాలు, సీసీ కెమెరాల ఏర్పాటుతో సహా వైద్యుల భద్రతకు అవసరమైన చర్యలు తీసుకోవాలని వెల్లడించింది. ‘ప్రభుత్వ వైద్య కళాశాలలు, ఆస్పత్రుల్లో వైద్యుల భద్రతను నిర్ధారించడానికి జిల్లా కలెక్టర్లు, పోలీసు ఉన్నతాధికారులు పరిస్థితిని పరిష్కరించాలి. పురుష, మహిళా డాక్టర్లకు విశ్రాంతి గదులు ఏర్పాటు చేయడంతోపాటు సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలి’ అని సూచించింది.

వైద్యుల తరఫు న్యాయవాది తమకు మూడు రోజులు అవసరమని చెప్పగా వారికి ఇప్పటికే రెండు రోజుల సమయం ఇస్తున్నట్లు సీజేఐ చెప్పారు. మరోవైపు సీఐఎస్‌ఎఫ్ సైనికులందరికీ నివాసం ఉండేలా ఇళ్లను ఏర్పాటు చేయాలని రాష్ట్ర హోంశాఖ కార్యదర్శిని ధర్మాసనం ఆదేశించింది. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం తరఫున కపిల్ సిబల్ వాదనలు వినిపించారు. ‘వైద్యులు తిరిగి పనిలోకి వచ్చేలా చూడాలని కోరుకుంటున్నాం మేము వారికి భద్రత కల్పిస్తాం. కానీ వారు విధుల్లో చేరాలి’ అని వ్యాఖ్యానించారు.తదుపరి విచారణను న్యాయస్థానం సెప్టెంబర్ 17కు వాయిదా వేసింది.

Advertisement

Next Story

Most Viewed