సినిమాల్లో దివ్యాంగులను కించపరిచే హాస్యం ఉండకూడదు: సుప్రీంకోర్టు మార్గదర్శకాలు

by S Gopi |   ( Updated:2024-07-08 15:52:02.0  )
సినిమాల్లో దివ్యాంగులను కించపరిచే హాస్యం ఉండకూడదు: సుప్రీంకోర్టు మార్గదర్శకాలు
X

దిశ, నేషనల్ బ్యూరో: సినిమాలు, డాక్యుమెంటరీలతో సహా దృశ్య మాధ్యమాలలో దివ్యాంగుల (పీడబ్ల్యూడీ)ను కించపరిచే మూస పద్ధతి, వివక్షను నివారించడానికి సమగ్ర మార్గదర్శకాలను విడుదల చేస్తూ సుప్రీంకోర్టు సోమవారం ఒక మైలురాయి తీర్పు ఇచ్చింది. 'స్టీరియోటైపింగ్ అనేది గౌరవానికి, వివక్షకు విరుద్ధం' అని భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. వ్యక్తిగత హక్కులను పరిరక్షించడంలో మాత్రమే కాకుండా, వైకల్యానికి సంబంధించిన అన్ని అంశాలను పరిష్కరించడంలో కూడా న్యాయవ్యవస్థ పాత్రను ధర్మాసనం ప్రస్తావించింది. అవి లింగం, మానసిక ఆరోగ్యం, సమానత్వాన్ని కాపాడటం, వ్యక్తులందరి ప్రాథమిక హక్కులను గుర్తు చేయడం ఈ మార్గదర్శకాల ఉద్దేశమని ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ సందర్భంగా న్యాయమూర్తులు జేబీ పార్దివాలా, మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం తన మార్గదర్శకాల్లో.. సినిమా స్క్రీనింగ్‌కు ముందు అనుమతించే సర్టిఫికేట్ అందించే సీబీఎఫ్‌సీ నిపుణుల అభిప్రాయాన్ని తప్పనిసరిగా తీసుకోవాలి. దివ్యాంగులపై వాస్తవాలను చిత్రించేందుకు దృశ్య మాధ్యమాలు కృషి చేయాలి. వారు ఎదుర్కొనే సమస్యలే కాకుండా వారి ప్రతిభ, విజయం, సమాజానికి చేసే సేవలను చూపించాలి. వైకల్యం ఉన్న వ్యక్తులను కించపరిచే, అగౌరవపరిచే హాస్యం ఉండకూడదని స్పష్టం చేసింది. కాగా, హిందీ చిత్రం ఆంఖ్ మిచోలీలో దివ్యాంగులను కించపరిచేలా సన్నివేశాలు ఉన్నాయంటూ నిపున్ మల్హోత్రా అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌పై కోర్టు ఈ మేరకు తీర్పు ఇచ్చింది.

Advertisement

Next Story

Most Viewed