Supreme court: రైతుల సమస్యలను సామరస్యంగా పరిష్కరించాలి.. కమిటీ ఏర్పాటు చేసిన సుప్రీంకోర్టు

by vinod kumar |
Supreme court: రైతుల సమస్యలను సామరస్యంగా పరిష్కరించాలి.. కమిటీ ఏర్పాటు చేసిన సుప్రీంకోర్టు
X

దిశ, నేషనల్ బ్యూరో: శంభు సరిహద్దులో నిరసన తెలుపుతున్న రైతుల సమస్యలను సామరస్యంగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు తెలిపింది. ఈ మేరకు పంజాబ్, హర్యానా హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ నవాబ్ సింగ్ నేతృత్వంలో సోమవారం ఓ కమిటీని ఏర్పాటు చేసింది. జస్టిస్ సూర్యకాంత్, ఉజ్జల్ భుయాన్‌లతో కూడిన ధర్మాసనం ఈ నిర్ణయం తీసుకుంది. వారంలోగా కమిటీ తొలి సమావేశాన్ని ఏర్పాటు చేయాలని ఆదేశించింది. పరిష్కరించాల్సిన కీలక అంశాలను గుర్తించాలని సూచించింది. రైతుల సమస్యలను రాజకీయం చేయొద్దని, దశలవారీగా వారి సమస్యలను కమిటీ పరిశీలించాలని సూచించింది. రైతులు తమ శాంతియుత ఆందోళనలను ప్రత్యామ్నాయ ప్రాంతాలకు మార్చుకునేందుకు స్వేచ్ఛ ఉంటుందని స్పష్టం చేసింది.

కాగా, ఈ ఏడాది ఫిబ్రవరి 13 నుంచి నిరసన తెలుపుతున్న రైతులు అంబాలా సమీపంలోని శంభు సరిహద్దులో ఏర్పాటు చేసిన బారికేడ్లను వారం రోజుల్లోగా తొలగించాలని హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ హర్యానా ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు విచారించింది. ఆందోళన చేస్తున్న రైతుల వద్దకు కమిటీ సభ్యులు వెళ్లి వారి ట్రాక్టర్లను తొలగించేలా అభ్యర్థించాలని తెలిపింది. అంతకుముందు విచారణలో శంభు సరిహద్దును పాక్షికంగా తెరవాలని సుప్రీంకోర్టు కోరింది. అయితే ఇప్పటివరకు శంభు సరిహద్దు తెరుచుకోలేదు.

Advertisement

Next Story