Supreme Court : నోటీసులివ్వకుండా ఇల్లు కూల్చివేస్తారా ? యోగి సర్కారుపై ‘సుప్రీం’ ఆగ్రహం

by Hajipasha |   ( Updated:2024-11-06 13:31:05.0  )
Supreme Court : నోటీసులివ్వకుండా ఇల్లు కూల్చివేస్తారా ? యోగి సర్కారుపై ‘సుప్రీం’ ఆగ్రహం
X

దిశ, నేషనల్ బ్యూరో : బుల్డోజర్ చర్యలపై సుప్రీంకోర్టు(Supreme Court) మరోసారి సీరియస్ అయింది. చట్టపరమైన ప్రొసీడింగ్స్ లేకుండా ఇష్టారాజ్యంగా ప్రైవేటు ఆస్తులను కూల్చివేసే ట్రెండ్‌పై దేశ సర్వోన్నత న్యాయస్థానం ఆందోళన వ్యక్తం చేసింది. 2019 సంవత్సరం జులైలో ఉత్తరప్రదేశ్‌లోని మహారాజ్‌గంజ్‌‌ పరిధిలో రోడ్ల విస్తరణ పనులు నిర్వహించారు. ఈక్రమంలో రోడ్డు విస్తరణ కోసమంటూ మనోజ్‌ తిబ్రేవాల్‌ ఆకాశ్‌ అనే వ్యక్తి ఇంటిని అధికారులు బుల్డోజర్లతో కూల్చివేయించారు. ఈ కూల్చివేతకు ముందు మనోజ్‌‌కు లీగల్ నోటీసులు కానీ, ముందస్తు సమాచారం కానీ ఇవ్వలేదు. అధికారుల నిరంకుశ వైఖరి వల్ల తాను నష్టపోయానంటూ మనోజ్‌ తిబ్రేవాల్‌ ఆకాశ్‌ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశాడు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి తనకు పరిహారం ఇప్పించాలని కోరాడు. దీనిపై బుధవారం తీర్పును వెలువరించే క్రమంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ (Chandrachud) సారథ్యంలోని ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది.

‘‘ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరించింది. ఎవరి ఆస్తినైనా కూల్చే ముందు.. వారికి ముందస్తు సమాచారంతో నోటీసులు ఇవ్వాలి. వాదనలు వినిపించేందుకు వారికి కూడా అవకాశం ఇవ్వాలి. ఆ తర్వాతే కూల్చివేతలపై నిర్ణయం తీసుకోవాలి. ఇవేం లేకుండా.. సౌండ్‌ స్పీకర్‌‌లో పేరును అనౌన్స్ చేసి ఇంటిని ఖాళీ చేసి వెళ్లిపొమ్మంటే ఎలా ? ఇది చాలా అన్యాయం’’ అని యోగి సర్కారుకు సుప్రీంకోర్టు బెంచ్ మొట్టికాయలు వేసింది. బాధితుడు మనోజ్‌ తిబ్రేవాల్‌ ఆకాశ్‌‌కు నష్టపరిహారంగా రూ. 25 లక్షలను అందించాలని సంబంధిత అధికారులను ఆదేశించింది. కూల్చివేతకు కారణమైన అధికారులు, కాంట్రాక్టర్లపై విచారణ జరపడంతో పాటు వారిపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని యూపీ సర్కారుకు కోర్టు ఆర్డర్ ఇచ్చింది. రోడ్డు విస్తరణ పనులను నిర్వహించే క్రమంలో తప్పకుండా పాటించాల్సిన పలు మార్గదర్శకాలను రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సుప్రీంకోర్టు ఈసందర్భంగా జారీ చేసింది.

Advertisement

Next Story