కస్టడీలో ఉన్నప్పుడు ఎలా అరెస్ట్ చేస్తారు.. కేజ్రీవాల్ ఇష్యూపై CBIని నిలదీసిన సుప్రీంకోర్టు

by Harish |
కస్టడీలో ఉన్నప్పుడు ఎలా అరెస్ట్ చేస్తారు.. కేజ్రీవాల్ ఇష్యూపై CBIని నిలదీసిన సుప్రీంకోర్టు
X

దిశ, నేషనల్ బ్యూరో: లిక్కర్ పాలసీ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ బెయిల్ కోరుతూ వేసిన పిటిషన్‌ను అలాగే సీబీఐ అరెస్ట్‌ను సవాల్ చేస్తూ వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు గురువారం విచారిస్తుంది. ఈ సందర్భంగా కోర్టు సీబీఐకి పలు ప్రశ్నలు సంధించింది. ఈడీ కేసులో జ్యుడీషియల్ కస్టడీలో ఉండగా కేజ్రీవాల్‌ను ఎలా అరెస్ట్ చేశారని సీబీఐని కోర్టు నిలదీసింది. కస్టడీలో ఉన్నప్పుడు మళ్లీ అరెస్ట్ చేయాలంటే కోర్టు అనుమతి కావాలి, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్‌లో ఏదో ఉందని ధర్మాసనం వ్యాఖ్యానించింది.

కేజ్రీవాల్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది అభిషేక్‌ మను సింఘ్వీ వాదనలు వినిపిస్తూ, ఈడీ కేసులో కస్టడీలో ఉన్న వ్యక్తిని సీబీఐ అరెస్ట్ చేసింది. కేవలం ఇన్సూరెన్స్ కోసం వారు అరెస్టు చేశారు. అరెస్టును సమర్థించేందుకు ఎటువంటి ఆధారాలు చూపించలేదు. అరెస్ట్‌కు చెప్పినటువంటి కారణాలు అస్పష్టంగా ఉన్నాయని సింఘ్వీ చెప్పారు. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసుకు సంబంధించి ఏజెన్సీ దాఖలు చేసిన అసలు ఎఫ్‌ఐఆర్‌లో అరవింద్ కేజ్రీవాల్ ప్రస్తావన లేదని, దాదాపు ఎనిమిది నెలల వరకు తనను విచారణకు పిలవలేదని సింఘ్వీ వాదించారు.

ఈ కేసులో సహ నిందితులైన ఆప్ నేతలు మనీష్ సిసోడియా, సంజయ్ సింగ్, విజయ్ నాయర్, బీఆర్‌ఎస్ నాయకురాలు కె.కవితలకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసిందని ఆయన ఎత్తిచూపారు. సీబీఐ కేసులో నాలుగు, ఈడీ కేసులో తొమ్మిది ఛార్జిషీట్లు దాఖలయ్యాయి. వేల పేజీల డాక్యుమెంట్లు ఉన్నాయి కాబట్టి కేజ్రీవాల్ సాక్ష్యాలను తారుమారు చేయలేరని సింఘ్వీ చెప్పారు.

Advertisement

Next Story

Most Viewed