అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో అత్యవసర పరిస్థితి

by S Gopi |
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో అత్యవసర పరిస్థితి
X

దిశ, నేషనల్ బ్యూరో: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్ఎస్)లో అత్యవసర పరిస్థితి ఏర్పడింది. దీంతో భారత సంతతి వ్యోమగామి సునీత విలియమ్స్ అక్కడే చిక్కుకున్నారు. ఆమె భూమిపైకి ఎప్పుడొస్తారన్న దానిపై నాసా ఇంకా ఇప్పటికీ స్పష్టత ఇవ్వలేదు. సునీతా విలియమ్స్‌తో పాటు బచ్ విల్మోర్‌ను తప్పనిసరి పరిస్థితిలో బోయింగ్ స్టార్‌లైనర్ స్పేస్ క్రాఫ్ట్‌లో ఉండిపోవాల్సి వచ్చింది. ఐఎస్ఎస్‌కు అతి చేరువలో భారీగా ఉపగ్రహ వ్యర్థాలు ఉండటం మూలంగానే ఈ పరిస్థితి తలెత్తింది. బుధవారం ఐఎస్ఎస్‌కు అత్యంత చేరువగా ఓ ఉపగ్రహం ముక్కలై శకలాలు ఉన్నట్టు నాసా గుర్తించింది. దీని గురించి అంతరిక్షంలో ఉన్న వ్యోమగాములకు సమాచారం ఇచ్చారు. ముందు జాగ్రత్తగా సిబ్బందిని స్పేస్‌క్రాఫ్ట్‌లోకి వెళ్లాలని ఆదేశాలు జారీ చేసింది. దాంతో జూన్ 5 నుంచి అక్కడే ఉన్న సునీతా విలియమ్స్, బచ్ విల్మోర్‌ స్టార్‌లైనర్ క్యాప్సుల్‌లో తలదాచుకున్నారు. సుమారు గంటసేపు తర్వాత ముప్పులేదని నిర్ధారించుకుని వ్యోమగాములకు క్లియరెన్స్ ఇచ్చారు. కాగా, రష్యాకు చెందిన ఎర్త్ అబ్జర్వేషన్ ఉపగ్రం రిస్యూర్-1 రెండేళ్ల క్రితం నిరుపయోగంగా మారింది. ఈ ఉపగ్రహం బుధవారం సుమారు 100 ముక్కలుగా విడిపోయింది. ఈ ప్రక్రియ ఐఎస్ఎస్‌కు చేరువగా జరిగింది. కొన్ని గంటల పాటు ఉపగ్రహ శకలాలు వెలువడినట్టు లియోల్యాబ్స్‌ అనే స్పేస్‌ ట్రాకింగ్‌ కంపెనీ పేర్కొంది. సునీతా విలియమ్స్ రోదసి యాత్రకు వెళ్లడం ఇది మూడోసారి. మరో వ్యోమగామి బుచ్ విల్మోర్‌తో కలిసి జూన్ 5న బోయింగ్ స్టార్‌ లైనర్‌ రాకెట్‌లో ఐఎస్ఎస్‌కు చేరుకున్న ఆమె, తిరుగు ప్రయణానికి ఇబ్బందులు ఎదురయ్యాయి. అంతరిక్షంలోకి వెళ్లి దాదాపు రెండు వారాలు గడిచినా, వారు భూమిపైకి ఎప్పుడొస్తారన్నది దానిపై ఇప్పటివరకు ఎలాంటి స్పష్టత లేదు.

Advertisement

Next Story

Most Viewed