భూమిని తాకిన అతిపెద్ద 'సౌర తుఫాను'

by S Gopi |
భూమిని తాకిన అతిపెద్ద సౌర తుఫాను
X

దిశ, నేషనల్ బ్యూరో: సూర్యుడి నుంచి ఏర్పడిన అత్యంత శక్తివంతమైన సౌర తుఫాన్ ఈ నెల 24న భూమిని తాకింది. గడిచిన ఆరేళ్లలో భూమిని తాకిన అతి భారీ భూ అయస్కాంత తుఫాను ఇదేనని శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఆదివారం ఈ సౌర తుఫాను భూమిని తాకడంతో భూ అయస్కాంత క్షేత్రం దెబ్బతిన్నది. దీనివల్ల విద్యుత్ గ్రిడ్‌లు, నావిగేషన్, కమ్యూనికేషన్ సిస్టమ్‌ల‌లో చిన్న చిన్న అంత‌రాయాలు ఏర్పడ్డాయని ఎన్ఓఏఏ స్పేస్ వెదర్ ప్రిడిక్షన్ సెంటర్ సోమవారం ఓ ప్రకటనలో తెలిపింది. సూర్యుడి నుంచి ఏర్పడే శక్తివంతమైన పేలుళ్ల కారణంగా ఈ సౌర జ్వాలలు అంతరిక్షంలోకి వెదజల్లబడతాయి. ఇవి భూ వాతావారణాన్ని తాకడం వల్ల దీన్ని భూ అయస్కాంత తుఫానుగా పరిగణిస్తారు. ఇది భూమి అయస్కాంత క్షేత్రాన్ని ప్రభావితం చేయగలదు. ఇది ధృవాల వద్ద ఆకాశంలో మెరిసే సహజ కాంతిని ఏర్పరుస్తుంది. దీన్ని పోలార్ లైట్స్ అని కూడా పిలుస్తారు. సాధారణంగా ఈ సౌరజ్వాలలను భూమికి ఉండే అయస్కాంత క్షేత్రం అడ్డుకుంటుంది. తద్వారా భూమిపై ఉండే జీవజాలాన్ని రక్షిస్తుంది. కొన్ని సందర్భాల్లో అంతరిక్షంలోని శాటిలైట్లను కూడా ఇవి ప్రభావితం చేయగలవు. సౌర జ్వాలలు భూమిని తాకే సమయంలో శాటిలైట్లను సేఫ్ మోడ్‌లో ఉంచి శాస్త్రవేత్తను వాటికి ప్రమాదం కలగకుండా రక్షిస్తారు. ప్రతి 11 సంవత్సరాలకు ఒకసారి సూర్యుడు ధృవాన్ని మార్చుకుంటాడు. అంటే దక్షిణ ధృవం ఉత్తరంగానూ, ఉత్తర ధృవం దక్షిణంగా మారుతుంది. దీంతో సూర్యుడి గురుత్వాకర్షణ శక్తిలో ప్రభావం ఉంటుంది.

Advertisement

Next Story

Most Viewed