ఇండియా కూటమికి బదులు 'ఇండియా ఎయిర్‌లైన్స్‌'కు ఓటు వేయమన్న కాంగ్రెస్‌ అభ్యర్థి

by S Gopi |
ఇండియా కూటమికి బదులు ఇండియా ఎయిర్‌లైన్స్‌కు ఓటు వేయమన్న కాంగ్రెస్‌ అభ్యర్థి
X

దిశ, నేషనల్ బ్యూరో: ఎన్నికల ప్రచార ఒత్తిడిలో రాజకీయ నేతలు మాటలు తడబడటం సాధారణమే. కీలక నేతలు సైతం పలు సందర్భాల్లో ఒకటి అనబోయి మరొకటి మాట్లాడేస్తుంటారు. అలాంటి ఘటనే తాజాగా గుజరాత్‌లో చోటుచేసుకుంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఓ కాంగ్రెస్ అభ్యర్థిని విపక్షాల 'ఇండియా కూటమికి ఓటు వేయమనడానికి బదులుగా 'ఇండియా ఎయిర్‌లైన్స్' కు వేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో పోస్ట్ అవడంతో వైరల్‌గా మారింది. వివరాల్లోకి వెళ్తే.. గుజరాత్‌లోని బనస్కాంత లోక్‌సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా జెనిబెన్ నాగాజీ ఠాకూర్ పోటీ చేస్తున్నారు. తాజాగా ఎన్నికల ప్రచారం సందర్భంగా మాట్లాడుతూ.. 'కేంద్రంలో బలమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఈసారి భారత్‌తో పాటు గుజరాత్ ప్రజలు 'ఇండియా ఎయిర్‌లైన్స్'కు తమ ఆశీర్వాదం అందించాలని అన్నారు. ఈ వ్యాఖ్యలు కాస్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో కాంగ్రెస్ అభ్యర్థిపై రకరకాల కామెంట్లు వస్తున్నాయి. కాగా, గుజరాత్‌లో మొత్తం 26లో 25 లోక్‌సభ స్థానాలకు మూడోదశ పోలింగ్ ఈ నెల 7న జరిగింది.

Advertisement

Next Story