Siddaramaiah: ముడా స్కామ్ కేసు ఓ బూటకం.. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య

by vinod kumar |
Siddaramaiah: ముడా స్కామ్ కేసు ఓ బూటకం.. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య
X

దిశ, నేషనల్ బ్యూరో: మైసూరు అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ (ముడా) స్థలం కేటాయింపు కేసులో తనపై దర్యాప్తు చేసేందుకు గవర్నర్ అనుమతి ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ కర్ణాటక సీఎం సిద్ధరామయ్య దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు మంగళవారం కొట్టివేసింది. ఈ నేపథ్యంలో సిద్ధరామయ్య స్పందించారు. మోడీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం ప్రతిపక్ష పాలిత రాష్ట్ర ప్రభుత్వాలపై ప్రతీకార రాజకీయాలకు పాల్పడుతోందని ఆరోపించారు. గవర్నర్లతో రాష్ట్ర ప్రభుత్వాలను విచ్చిన్నం చేసేందుకు కుట్ర పన్నుతోందని ఫైర్ అయ్యారు. ముడా కేసు కేవలం ఓ బూటకమని, పేదలు, అణగారిన వర్గాలకు మేలు చేసే కాంగ్రెస్ ప్రభుత్వ పథకాలను నిలిపిసేందుకే బీజేపీ, జనతాదళ్ సెక్యులర్ (జేడీఎస్)లు తనను టార్గెట్ చేశాయన్నారు. సీఎం పదవికి రాజీనామా చేసే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు.

దర్యాప్తును ఎదుర్కొనేందుకు వెనుకాడబోనని స్పష్టం చేశారు. న్యాయ నిపుణులతో సంప్రదించిన తర్వాత తదుపరి కార్యాచరణ ప్రకటిస్తానన్నారు. గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవడంతో నిరుత్సాహానికి గురైన బీజేపీ కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వ పతనానికి కుట్ర పన్నిందని ఆరోపించారు. ‘కర్ణాటక ప్రజలు బీజేపీకి సొంతంగా అధికారంలోకి వచ్చేంత మెజారిటీ ఎప్పుడూ ఇవ్వలేదు. ఇప్పటి వరకు కేవలం అనైతికంగా ఆపరేషన్ కమలం నిర్వహించి పగ్గాలు చేపట్టారు. కానీ గత ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు ఆపరేషన్‌ కమలానికి అవకాశం ఇవ్వకుండా కాంగ్రెస్‌కు స్పష్టమైన మెజారిటీ ఇచ్చారు. అందుకే బీజేపీ, జేడీఎస్‌లు రాజ్‌భవన్‌ను తమకు అనుకూలంగా మార్చుకుని ప్రభుత్వానికి ఇబ్బంది కలిగించేందుకు ప్రయత్నిస్తున్నారు’ అని వ్యాఖ్యానించారు.

Advertisement

Next Story

Most Viewed