MUDA Case: సీఎం పదవికి రాజీనామా ప్రసక్తే లేదు: డీకే శివకుమార్

by Harish |
MUDA Case: సీఎం పదవికి రాజీనామా ప్రసక్తే లేదు: డీకే శివకుమార్
X

దిశ, నేషనల్ బ్యూరో: కర్ణాటక రాజకీయాల్లో సంచలనం సృష్టించిన ముడా కుంభకోణం కేసులో రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్దరామయ్యకు హైకోర్టు షాక్ ఇచ్చింది. కుంభకోణానికి సంబంధించి తనను విచారించేందుకు గవర్నర్ థావర్‌చంద్‌ గహ్లోత్ అనుమతి మంజూరు చేయడాన్ని గతంలో సీఎం హైకోర్టులో సవాల్ చేయగా, ఆ పిటిషన్‌ను మంగళవారం కోర్టు కొట్టివేసింది. ఈ నేపథ్యంలో ఆయనకు రాష్ట్ర కేబినెట్ నుంచి మద్దతు లభించింది. ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఆయనకు తోడుగా నిలిచారు.

ఈ మేరకు విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, సీఎం పదవికి సిద్దరామయ్య రాజీనామా చేసే ప్రసక్తే లేదని అన్నారు. ఆయన ఏ తప్పు చేయలేదు. స్కామ్‌తో సీఎంకు ఎలాంటి సంబంధం లేదు. ఇది బీజేపీ ఆడుతున్న రాజకీయ కుట్ర, ఆయన దేశం కోసం, పార్టీ కోసం, ప్రజల కోసం పనిచేస్తున్నారు. అయినప్పటికి ఆయనను కావాలనే ఇరికించాలని బీజేపీ కుట్రలు పన్నుతుంది. ఇది అందరికీ తెలుసు. అయితే న్యాయవ్యవస్థను పార్టీ గౌరవిస్తుంది. అంతకుముందు నేను కూడా పెద్ద కుట్రను ఎదుర్కొన్ని క్లీన్‌గా బయటకు వచ్చినట్లు ఆయన కూడా అలాగే వస్తారు. ప్రభుత్వాన్ని అస్థిరపరిచే గవర్నర్ ప్రయత్నాలకు లేదా బీజేపీ కుట్రకు లొంగిపోయే ప్రశ్న లేదని అన్నారు.

దేశంలోని ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టడమే బీజేపీ పని, సీఎంకు మా అందరి మద్దతు ఉంటుంది. అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడటానికి కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందని డీకే అన్నారు. మరోవైపు కాంగ్రెస్ రాష్ట్ర యూనిట్ ఎక్స్‌లో గవర్నర్ థావర్ చంద్‌పై విమర్శలు చేసింది. కుమారస్వామి, ఇతర బీజేపీ నాయకులపై ఫిర్యాదులను కప్పిపుచ్చడానికి గవర్నర్ ప్రయత్నించారని, ఆయన పక్షపాత రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆరోపించింది.

ఇదిలా ఉంటే కోర్టు తీర్పు వెలువడిన వెంటనే, బీజేపీ, కాంగ్రెస్‌పై విమర్శలు చేసింది. కర్ణాటక బీజేపీ అధ్యక్షుడు బీవై విజయేంద్ర మాట్లాడుతూ అవినీతిలో కూరుకుపోయిన కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీ అలుపెరగని పోరాటం చేస్తోందని, అవినీతి సీఎం సిద్దరామయ్యకు వ్యతిరేకంగా పోరాడుతున్నామని, వెంటనే ఆయన రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

Next Story

Most Viewed