Siddaramaiah: ముడా కేసు రాజకీయ ప్రేరేపితమైంది.. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య

by vinod kumar |
Siddaramaiah: ముడా కేసు రాజకీయ ప్రేరేపితమైంది.. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య
X

దిశ, నేషనల్ బ్యూరో: మైసూరు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (Muda) కుంభకోణం కేసు రాజకీయ ప్రేరేపితమైందని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య (Siddaramaiah) అభివర్ణించారు. ఈ కేసులో న్యాయవ్యవస్థ ద్వారా తనకు న్యాయం జరుగుతుందనే నమ్మకం ఉందన్నారు. మంగళవారం ఆయన బెంగళూరు (Bengalur) లో మీడియాతో మాట్లాడారు. ముడా కేసు అంశంపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. న్యాయం గెలుస్తుందనే పూర్తి విశ్వానం ఉందని తెలిపారు. తన భార్య పార్వతికి ఎన్ ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) జారీ చేసిన నోటీసులపై ఆయన స్పందిస్తూ.. దీనిపై కోర్టు స్టే విధించిందని తెలిపారు. ఈడీ నోటీసు జారీ చేయడం రాజకీయ ప్రేరేపితమా అన్న ప్రశ్నకు సిద్ధరామయ్య సమాధానమిస్తూ.. మొత్తం ముడా కేసే రాజకీయ ప్రేరేపితమైందని స్పష్టం చేశారు. దీనిలో ఎటువంటి అనుమానమూ అవసరం లేదని తెలిపారు. రాజకీయ కుట్రలో భాగంగానే దీనిని ముందుకు తీసుకొచ్చారని నొక్కి చెప్పారు.

కాగా, ముడా భూ కుంభకోణానికి సంబంధించిన కేసులో సిద్ధరామయ్య భార్య బీఎం పార్వతి, రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బైరతి సురేష్‌ (Suresh) లకు ఈడీ జారీ చేసిన సమన్లపై జస్టిస్ ఎం. నాగప్రసన్న నేతృత్వంలోని కర్ణాటక హైకోర్టు ధార్వాడ్ బెంచ్ సోమవారం స్టే విధించింది. అలాగే ఈ కేసుపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ)తో విచారణ జరిపించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై తీర్పును కర్ణాటక హైకోర్టు రిజర్వ్ చేసింది. దీంతో కర్ణాటకలో తీవ్ర రాజకీయ ప్రకంపనలు రేపిన ముడా స్కామ్ పై తీవ్ర ఉత్కంఠ కొనసాగుతోంది.

👉 Dishadaily Web Stories

Advertisement

Next Story