అమెరికాలో కాల్పులు..భారత సంతతి మహిళ మృతి

by Vinod |
అమెరికాలో కాల్పులు..భారత సంతతి మహిళ మృతి
X

దిశ, నేషనల్ బ్యూరో: అమెరికా న్యూజెర్సీలోని మిడిల్‌సెక్స్ కౌంటీలో ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో భారత సంతతి మహిళ మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ నెల 14న ఈ ఘటన జరగగా తాజాగా పోలీసులు వివరాలు వెల్లడించారు. న్యూజెర్సీ రాష్ట్రంలోని మిడిల్ సెక్స్ కౌంటీలో ఇద్దరు మహిళలపై ఓ యువకుడు కాల్పులు జరిపాడు. దీంతో వారిద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని బాధితులిద్దరినీ ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలోనే పరిస్థితి విషమించి జస్వీత్ కౌర్(29) అనే మహిళ ప్రాణాలు కోల్పోగా..ఆమె సోదరి గగన్ దీప్ కౌర్ పరిస్థితి విషమంగా ఉంది. ఘటన అనంతరం నిందితుడు గౌరవ్ గిల్‌ను పోలీసులు అరెస్టు చేశారు.

కాగా, హత్యకు గురైన జస్వీత్ కౌర్, గాయపడిన గగన్ దీప్ కౌర్‌లు భారత్‌లోని పంజాబ్‌కు చెందిన వారు. వీరిద్దరూ ఐదేళ్ల క్రితం అమెరికా వెళ్లారు. జస్వీత్ కౌర్ భర్తతో నివాసముంటూ అమెజాన్‌లో పనిచేస్తోంది. మరోవైపు నిందితుడు కూడా పంజాబ్ రాష్ట్రానికి చెందిన వ్యక్తి కావడం గమనార్హం. గగన్ దీప్ కౌర్, నిందితుడికి ఇండియాలోనే పరిచయం ఉన్నట్టు సమాచారం. అయితే కాల్పులు జరపడానికి గల కారణాలు తెలియరాలేదు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు న్యూ జెర్సీ పోలీసులు వెల్లడించారు.

ఈ ఘటనపై న్యూయార్క్‌లోని భారత కాన్సులేట్ కార్యాలయం స్పందించింది. ‘న్యూజెర్సీలోని కార్టరేట్‌ రూజ్‌వెల్ట్ ఏవ్‌లో జరిగిన కాల్పుల్లో జస్వీర్ కౌర్ మరణించడం, గగన్‌దీప్ కౌర్‌కి తీవ్ర గాయాలు కావడం గురించి తెలుసుకుని చాలా బాధపడ్డాం. జస్వీత్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాం. కేసును సమగ్రంగా విచారించడానికి న్యూయార్క్ పోలీసులతో టచ్ లో ఉన్నాం’ అని ఎక్స్ లో పోస్ట్ చేసింది.

Next Story

Most Viewed