లాలూ ప్రసాద్‌కు షాక్: మనీలాండరింగ్ కేసులో ఆయన సన్నిహితుడి అరెస్టు

by samatah |
లాలూ ప్రసాద్‌కు షాక్: మనీలాండరింగ్ కేసులో ఆయన సన్నిహితుడి అరెస్టు
X

దిశ, నేషనల్ బ్యూరో: రాష్ట్రీయ జనతాదళ్(ఆర్జేడీ) చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్‌కు షాక్ తగిలింది. అక్రమ ఇసుక తవ్వకాల కేసులో ఆయనకు అత్యంత సన్నిహితుడైన సుభాష్ యాదవ్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అరెస్టు చేసింది. శనివారం అర్థరాత్రి సుభాష్‌ను అదుపులోకి తీసుకున్న ఈడీ పాట్నాలోని పీఎంఎల్ఏ ప్రత్యేక కోర్టులో సోమవారం హాజరుపరచనున్నట్టు తెలుస్తోంది. రాష్ట్రంలోని యాదవ్ సహా అతని అనుచరుల ప్రాంగణాల్లో ఈడీ దాడులు చేపట్టింది. 14గంటల పాటు జరిపిన సోదాల్లో సుమారు రూ.2.3కోట్ల నగదు దొరికింది. అంతేగాక అనేక స్థిరాస్తులకు సంబంధించిన పత్రాలు లభ్యమయ్యాయి. ఈ క్రమంలోనే ఈడీ సుభాష్‌ను అరెస్టు చేసింది.

బ్రాడ్‌సన్స్ కమోడిటీస్ ప్రయివేట్ లిమిటెడ్ అనే కంపెనీపై బిహార్ పోలీసులు 20 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారు. అనంతరం అక్రమ ఇసుక మైనింగ్ మనీలాండరింగ్ కేసుపై విచారణ ప్రారంభమైంది. కంపెనీ డైరెక్టర్లు, ఈ-చలాన్లను ఉపయోగించకుండా అక్రమ మైనింగ్, ఇసుక విక్రయాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. సుమారు రూ.161కోట్ల మేర మనీలాండరింగ్ జరిగిందని ఈడీ పేర్కొంది. గతేడాది ఈ కేసులో బిహార్ జేడీయూ నేత రాధా చరణ్ సా, ఆయన కుమారుడు కన్హయ్య ప్రసాద్, బ్రాడ్‌సన్స్ కమోడిటీస్ డైరెక్టర్లు మిథిలేష్ కుమార్ సింగ్, బాబన్ సింగ్, సురేంద్ర కుమార్ జిందాల్‌లను ఈడీ అరెస్టు చేసింది. వారు ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. కాగా, శనివారం పాట్నాలో జరిగిన ఓ కార్యక్రమంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రసంగిస్తూ..ఇసుక మాఫియాపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆయన ప్రకటించిన కొన్ని గంటల్లోనే సుభాష్ యాదవ్‌ను అరెస్టు చేయడం గమనార్హం.

Advertisement

Next Story

Most Viewed