అఖిలేష్ యాదవ్‌కు షాక్: అక్రమ మైనింగ్ కేసులో సీబీఐ సమన్లు!

by samatah |
అఖిలేష్ యాదవ్‌కు షాక్: అక్రమ మైనింగ్ కేసులో సీబీఐ సమన్లు!
X

దిశ, నేషనల్ బ్యూరో: సమాజ్ వారీ పార్టీ(ఎస్పీ) చీఫ్ అఖిలేష్ యాదవ్‌కు షాక్ తగిలింది. అక్రమ మైనింగ్ కేసులో విచారణ నిమిత్తం ఆయనకు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సీబీఐ) బుధవారం సమన్లు జారీ చేసినట్టు తెలుస్తోంది. ఈ కేసులో అఖిలేష్‌ను గురువారం ఢిల్లీలో విచారించనున్నట్టు సన్నిహిత వర్గాలు తెలిపాయి. 2012-16 మధ్యకాలంలో రూల్స్ ఉల్లంఘించి కొన్ని సంస్థలకు అక్రమంగా మైనింగ్ స్థలాలను కేటాయించారని ఆరోపణలు వచ్చాయి. దీంతో 2019లో దీనిపై సీబీఐ కేసు నమోదు చేసింది. మొత్తం 22టెండర్లను ఆమోదించారని సీబీఐ పేర్కొంది. ఉత్తరప్రదేశ్‌లోని ఏడు జిల్లాలు, షామ్లీ, కౌశాంబి, ఫతేపూర్, డియోరియా, సహరాన్‌పూర్, హమీర్‌పూర్ మరియు సిద్ధార్థనగర్‌లోనూ అక్రమ మైనింగ్ కేసులు నమోదయ్యాయి. అప్పటి నుంచి ఈ కేసును సీబీఐ దర్యాప్తు చేస్తుండగా.. తాజాగా అఖిలేష్‌కు నోటీసులు జారీ చేయడం గమనార్హం. రాష్ట్ర అధికారుల సహకారంతో అక్రమ మైనింగ్‌ జరుగుతోందా లేదా అనే దానిపై నివేదిక సమర్పించాలని సీబీఐని హైకోర్టు గతంలో ఆదేశించింది. కాగా, 2012-13 మధ్య అఖిలేష్ మైనింగ్ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టడం గమనార్హం. యూపీలో కాంగ్రెస్, ఎస్పీల మధ్య సీట్ షేరింగ్‌పై పొత్తు కుదిరిన నేపథ్యంలోనే నోటీసులు రావడం ప్రాధాన్యత సంతరించుకుంది.

Advertisement

Next Story