Shivraj singh: ప్రజల దృష్టి మరల్చేందుకే మమతా బెనర్జీ ప్రయత్నం.. కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్

by vinod kumar |
Shivraj singh: ప్రజల దృష్టి మరల్చేందుకే మమతా బెనర్జీ ప్రయత్నం.. కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్
X

దిశ, నేషనల్ బ్యూరో: లైంగిక దాడి నిందితులకు జీవితఖైదు విధించే బిల్లుకు పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఆమోదం తెలపడంపై కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ స్పందించారు. కోల్‌కతాలోని ఆర్జీకర్ మెడికల్ ఆస్పత్రి ఘటన నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు మమతా బెనర్జీ ఈ బిల్లును ముందుకు తెచ్చారని ఆరోపించారు. దీనిని గతంలోనే ఎందుకు ప్రవేశపెట్టలేదని ప్రశ్నించారు. మంగళవారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. 2017లో ఈ తరహా చట్టాన్ని మధ్యప్రదేశ్‌లో ఆమోదించామని గుర్తు చేశారు.

మైనర్ బాలికలపై లైంగిక దాడికి పాల్పడిన నిందితులకు ఉరిశిక్ష విధించేలా చట్టం చేసిన మొదటి రాష్ట్రంగా నిలిచిందని తెలిపారు. మమతా బెనర్జీ ఎంతో సున్నితంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. సందేశ్ ఖాలీలో మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడిన షాజహాన్ పై కూడా ఈ బిల్లు ప్రకారం చర్యలు తీసుకుంటారా అని ప్రశ్నించారు. కోల్ కతాలో జరిగిన దారుణ ఘటనకు కారణమైన వారికి మరణశిక్ష విధించాలని డిమాండ్ చేశారు. కాగా, ‘అపరాజిత ఉమెన్ అండ్ చైల్డ్ బిల్లు-2024’ పేరుతో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం బిల్లు తీసుకొచ్చిన విషయం తెలిసిందే.

Advertisement

Next Story