Sanjay raut: షిండే శకం ముగిసింది.. శివసేన (యూబీటీ) నేత సంజయ్ రౌత్

by vinod kumar |
Sanjay raut: షిండే శకం ముగిసింది.. శివసేన (యూబీటీ) నేత సంజయ్ రౌత్
X

దిశ, నేషనల్ బ్యూరో: మహారాష్ట్రలో మహాయుతి ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేయనున్న వేళ శివసేన(UBT) నేత, రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్ (Sanjay raut) సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఏక్ నాథ్ షిండే (Eknath shinde) శకం ముగిసిందని, ఆయన ఇక ఎప్పటికీ సీఎం కాలేడని చెప్పారు. బీజేపీ షిండేను ఉపయోగించుకుందని, ఇప్పుడు ఆయన పని అయిపోవడంతో పక్కన పెట్టిందని విమర్శించారు. గురువారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. షిండే తిరుగుబాటు తర్వాత శివసేన చీలిపోయిందని, ఇప్పుడు మరొక సారి షిండే నేతృత్వంలోని శివసేనను సైతం విచ్ఛిన్నం చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. స్పష్టమైన మెజారిటీ ఉన్నప్పటికీ మహారాష్ట్ర సీఎంను వెల్లడించడంలో జాప్యం జరిగిందని, దీనిని బట్టి చూస్తే మహాయుతి ఏదో తప్పు చేసే ఉంటుందనే అనుమానాలు కలుగుతున్నాయన్నారు. ఈ విషయం త్వరలోనే బహిర్గతమవుతుందని చెప్పారు. మహాయుతి నేతలు దేశ ప్రయోజనాలు, మహారాష్ట్ర ప్రజల సంక్షేమం కోసమో పని చేయడం లేదని కేవలం స్వార్థంతోనే ఒక్కటయ్యారని మండిపడ్డారు. ఎన్నికల ఫలితాలకు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రజలంతా వీధుల్లోకి వచ్చినా, వారు దానిని అంగీకరించడం లేదన్నారు. కాగా, సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ (Devendra Fadnavis) ప్రమాణం చేయనున్న నేపథ్యంలో సంజయ్ రౌత్ వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి.

Advertisement

Next Story