అమేథీ కాంగ్రెస్ అభ్యర్థిగా రాబర్ట్ వాద్రా!: పార్టీ కార్యాలయం వద్ద వెలసిన పోస్టర్లు

by Dishanational2 |
అమేథీ కాంగ్రెస్ అభ్యర్థిగా రాబర్ట్ వాద్రా!: పార్టీ కార్యాలయం వద్ద వెలసిన పోస్టర్లు
X

దిశ, నేషనల్ బ్యూరో: లోక్‌సభ ఎన్నికల తొలి దశ పోలింగ్ ముగిసినా ఉత్తరప్రదేశ్‌లోని అమేథీ, రాయ్ బరేలీ స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు ఎవరనే దానిపై ఇంకా ఉత్కంఠ నెలకొనే ఉంది. కాంగ్రెస్ తన అభ్యర్థిని ప్రకటించకపోవడంతో సన్సెన్స్ నెలకొంది. అయితే తాజాగా కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంకా గాంధీ భర్త రాబర్ట్ వాద్రాకు మద్దతుగా పార్టీ కార్యాలయం వద్ద పోస్టర్లు వెలిశాయి. ‘అమేథీ ప్రజలు ఈ సాకి రాబర్ట్ వాద్రా పోటీ చేయాలని కోరుకుంటున్నారు’ అని పోస్టర్లలో పేర్కొన్నారు. దీంతో ఇక్కడి నుంచి వాద్రా పోటీచేయబోతున్నారనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. అయితే రాబర్ట్ వాద్రా సైతం తనకు రాజకీయాలపై ఆసక్తి ఉందని ఇటీవల వ్యాఖ్యానించారు. దీంతో అమేథీ నుంచి ఆయన బరిలోకి దిగడం ఖాయమైందని పలువురు భావిస్తున్నారు.

అయితే తాజా పరిణామాలపై కాంగ్రెస్ అధికార ప్రతినిధి సురేంద్ర రాజ్‌పుత్ స్పందించారు. అలాంటి పోస్టర్లన్నీ బీజేపీ సృష్టించినవేనని ఆరోపించారు. ఎవరిని పోటీలో నిలపాలనే దానిపై త్వరలోనే పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని వెల్లడించారు. రాబర్ట్ వాద్రాను రాహుల్ బరిలోకి దించాలని చూస్తున్నారని స్మృతి ఇరానీ వ్యాఖ్యానించిన మరుసటి రోజే ఈ పోస్టర్లు వెలువడటం గమనార్హం. ఏప్రిల్ 26 తర్వాత కాంగ్రెస్ ఎప్పుడైనా ఈ రెండు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. కాగా, అమేథీ, రాయ్ బరేలీ స్థానాల్లో మే 20న ఐదో దశలో పోలింగ్ జరగనుంది. మే 3వ తేదీ నామినేషన్లకు చివరి తేదీగా ఉంది.



Next Story

Most Viewed