CBI : జూనియర్ వైద్యురాలి కేసు.. రికార్డులను పోలీసు స్టేషనులోనే తప్పుల తడకగా మార్చారు : సీబీఐ

by Hajipasha |
CBI : జూనియర్ వైద్యురాలి కేసు.. రికార్డులను పోలీసు స్టేషనులోనే తప్పుల తడకగా మార్చారు : సీబీఐ
X

దిశ, నేషనల్ బ్యూరో : కోల్‌కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజీలో ఆగస్టు 9న జూనియర్ వైద్యురాలిపై జరిగిన హత్యాచారం కేసుపై సీబీఐ దర్యాప్తులో మరో కీలక విషయం వెలుగుచూసింది. కోల్‌కతాలోని తాలా పోలీసు స్టేషన్‌లో ఈ కేసుకు సంబంధించిన కొన్ని రికార్డులను తప్పుడు సమాచారంతో తయారు చేశారని సీబీఐ పేర్కొంది. ఇంకొన్ని రికార్డులలోని సమాచారంలో ఇష్టానుసారంగా మార్పులు చేర్పులు చేశారని తెలిపింది. ఈమేరకు వివరాలతో కూడిన నివేదికను కోల్‌కతాలోని స్పెషల్ కోర్టుకు సీబీఐ బుధవారం సమర్పించింది. కేసు రికార్డులను తారుమారు చేసిన నేపథ్యంలో తాలా పోలీసు స్టేషన్ సీసీటీవీ ఫుటేజీని సీజ్ చేశామని సీబీఐ పేర్కొంది. ఆ ఫుటేజీని టెస్టింగ్ నిమిత్తం సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీ (సీఎఫ్ఎస్ఎల్)కి పంపామని వెల్లడించింది.

‘‘ఈ కేసులో కీలక నిందితుడిగా ఉన్న కాలేజీ సెక్యూరిటీ గార్డ్ సంజయ్ రాయ్ దుస్తులను సీజ్ చేసే విషయంలో పోలీసులు రెండు రోజుల జాప్యం చేశారు. ఒకవేళ ఆ దుస్తులను వెంటనే సీజ్ చేసి ఉంటే ఈ కేసులో కీలక సాక్ష్యంగా మారి ఉండేవి’’ అని న్యాయస్థానానికి సమర్పించిన రిపోర్టులో సీబీఐ తెలిపింది. తాలా పోలీస్ స్టేషన్ హౌజ్ ఆఫీసర్ అభిజిత్ మోండల్, ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్‌లను కోర్టు ఎదుట సీబీఐ ప్రవేశపెట్టింది. వీరిద్దరిని కస్టడీలో విచారించగా కేసు రికార్డుల్లోని అవకతవకల సమాచారం బయటపడిందని కోర్టుకు తెలిపింది. దీంతో అభిజిత్ మోండల్, సందీప్ ఘోష్‌ల జ్యుడీషియల్ కస్టడీ గడువును సెప్టెంబరు 30 వరకు పొడిగిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

Next Story

Most Viewed