RG kar doctors: ఆర్జీకర్ ఆస్పత్రిలో 50 మంది వైద్యుల రాజీనామా.. జూనియర్ డాక్టర్ల దీక్షకు మద్దతు

by vinod kumar |
RG kar doctors: ఆర్జీకర్ ఆస్పత్రిలో 50 మంది వైద్యుల రాజీనామా.. జూనియర్ డాక్టర్ల దీక్షకు మద్దతు
X

దిశ, నేషనల్ బ్యూరో: కోల్‌కతాలోని ఆర్‌జీ కర్ మెడికల్ కాలేజ్ అండ్ ఆస్పత్రికి చెందిన సుమారు 50 మంది వైద్యులు రాజీనామా చేశారు. ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న జూనియర్ డాక్టర్లకు మద్దతుగా వారు ఈ నిర్ణయం తీసుకున్నారు. మంగళవారం జరిగిన ఆస్పత్రిలోని వివిధ విభాగాల హెచ్ ఓడీల సమావేశంలో వైద్యులు రాజీనామా లేఖలపై సంతకాలు చేశారు. న్యాయం కోసం పోరాడుతున్న యువ వైద్యులకు సంఘీభావం తెలుపుతున్నట్టు స్పష్టం చేశారు. జూనియర్ డాక్టర్లు దీక్ష చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమని తెలిపారు. క్యాంపస్‌లో పేషెంట్లకు అనుకూలమైన వ్యవస్థ కోసం తాము పోరాడుతున్న జూనియర్ వైద్యులతో ఐక్యంగా నిలబడతామని వెల్లడించారు. దీక్ష చేస్తున్న వైద్యుల ఆరోగ్య పరిస్థితిపైనా వారు ఆందోళన వ్యక్తం చేశారు.

కాగా, తమ డిమాండ్ల కోసం ఆరుగురు జూనియర్ డాక్టర్లు చేపడుతున్న ఆమరణ నిరాహార దీక్ష మంగళవారం నాటికి నాలుగో రోజుకు చేరుకుంది. ఆరోగ్య శాఖ కార్యదర్శి ఎన్‌ఎస్‌ నిగమ్‌ను తొలగించడం సహా 9 డిమాండ్లపై వారు పట్టువీడటం లేదు. ఈ దీక్షపైనా పశ్చిమబెంగాల్ ప్రభుత్వం స్పందించడం లేదు. మరోవైపు ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా మెడికల్ అసోసియేషన్స్ జూనియర్ వైద్యులకు తన మద్దతును ప్రకటించింది. బుధవారం దేశవ్యాప్తంగా వైద్యులు నిరాహారదీక్ష చేపట్టనున్నట్లు తెలిపింది.

Advertisement

Next Story

Most Viewed