పంజాబ్ గవర్నర్ రాజీనామా: రాష్ట్ర ప్రభుత్వంతో వివాదం వేళ కీలక పరిణామం

by samatah |
పంజాబ్ గవర్నర్ రాజీనామా: రాష్ట్ర ప్రభుత్వంతో వివాదం వేళ కీలక పరిణామం
X

దిశ, నేషనల్ బ్యూరో: పంజాబ్ గవర్నర్, ఆ రాష్ట్ర ప్రభుత్వానికి పెండింగ్ బిల్లులపై వివాదం కొనసాగుతున్న వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. గవర్నర్ బన్వరీలాల్ పురోహిత్ శనివారం తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు రాజీనామా లేఖను పంపించారు. వ్యక్తిగత కారణాలతో రిజైన్ చేస్తున్నట్టు ప్రకటించారు. అంతేగాక చండీగఢ్ అడ్మినిస్ట్రేటివ్ పదవికి కూడా రాజీనామా చేశారు. 2021 ఆగస్టులో పంజాబ్ గవర్నర్‌గా, చండీగఢ్ అడ్మినిస్ట్రేటర్‌గా బన్వరీలాల్ బాధ్యతలు స్వీకరించారు. ‘వ్యక్తిగత కారణాలు, ఇతర సమస్యల కారణంగా రెండు పదవుల నుంచి వైదొలగుతున్నట్టు ముర్ముకు రాసిన లేఖలో పేర్కొన్నారు. తన రాజీనామాను ఆమోదించాలని కోరారు. కాగా, పురోహిత్ గతంలో అసోం, మేఘాలయ(అదనపు బాధ్యతలు), తమిళనాలు రాష్ట్రాలకూ గవర్నర్‌గా పనిచేశారు. పంజాబ్‌లోని అధికార ఆప్ ప్రభుత్వానికి పురోహిత్‌కు మధ్య వివాదం జరుగుతున్న నేపథ్యంలో రాజీనామా చేయడం గమనార్హం. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై వివరణ ఇవ్వాలని కోరుతూ బన్వర్‌లాల్ సీఎం భగవంత్ మాన్‌కు వరుస లేఖలు రాశారు. ఈ అంశం ప్రస్తుతం సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉంది.

Advertisement

Next Story

Most Viewed